డ్వాక్రా రుణ చెల్లింపుల్లో వివాదం !
రూ.75 వేల నగదు జమపై పరస్పర ఆరోపణలు..
ఆధారాలతో లెక్కలు తేలుస్తామన్న అధికారులు
హత్నూర, నవంబరు 20: డ్వాక్రా గ్రూపు రుణ(Dwakra Group Loan) చెల్లింపులు, నగదు జమ(Cash Deposit) వ్యవహారం ఇద్దరి మధ్య వివాదానికి దారితీసింది. హత్నూర గ్రామంలోని(Hatnoora Village) మందార డ్వాక్రా గ్రూపునకు(Mandara DWCRA Group) చెందిన రూ.75 వేల నగదు బ్యాంకులో జమ చేసే విషయంలో గ్రూపు లీడర్ దుర్గవేణి, వీవోఏ జ్యోతి పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. నగదు తీసుకున్నప్పటికీ రసీదు ఇవ్వలేదని దుర్గవేణి ఆరోపించగా, తానే రుణ వాయిదాలు(Loan installments) చెల్లించానని జ్యోతి వాదించారు.
గ్రూపు సభ్యులకు సంబంధించిన రూ.75 వేల నగదును బ్యాంకులో జమ చేసేందుకు జ్యోతికి అప్పగించానని, నగదు తీసుకున్న సమయంలో రసీదు ఇవ్వకుండా మరుసటి రోజు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని దుర్గవేణి ఆరోపించారు. తన పేరు మీద ఉన్న రూ.లక్ష రుణానికి సంబంధించి తాను 7 నెలల వాయిదాలు చెల్లించానని, మిగిలిన 14 నెలలకు సంబంధించిన నగదును కూడా జ్యోతి నా పేరు మీద తీసుకున్నందుకు ఆమె చెల్లించారని పేర్కొన్నారు.
తనకు రావాల్సిన సొమ్మును తిరిగి ఇప్పించి న్యాయం చేయాలని కోరారు. అయితే, ఈ ఆరోపణలను జ్యోతి ఖండించారు. రూ.లక్ష రుణం తన పేరు మీద తీసుకున్నందుకు మొత్తం పైసలు నేనే చెల్లించాలని అందులో దుర్గవేణి ఏడు నెలల వాయిదాలు చెల్లించారని చెప్పడం అబద్ధమని, వాయిదాలను తానే చెల్లించి రుణాన్ని ముగించానని జ్యోతి తెలిపారు. ఇరువురి మధ్య ఉన్న లెక్కలను గ్రూపు సభ్యుల సమక్షంలో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని వెల్లడించారు.
ఈ వ్యవహారంపై ఐకేపీ సీసీ నాగరాణి, అకౌంటెంట్ నాగమణి స్పందిస్తూ గ్రూపులో పది మంది సభ్యులు ఉన్నారని, దుర్గవేణి, నిర్మల లీడర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సభ్యుల పేర్లపై తీసుకున్న రుణాలు, చెల్లింపులకు సంబంధించిన వివరాలను పరిశీలించి విచారణ నివేదిక సమర్పించాల్సి ఉందన్నారు. ఏపీఎం సమక్షంలో సభ్యులందరినీ కూర్చోబెట్టి నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు, రసీదులను పరిశీలించి లెక్కలు తేలుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత సభ్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.