అధికారులు... కారుకూతలు
- సమస్యలపై వస్తే సతాయింపు
- పరిష్కారం కోరితే పరిహాసం
- ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్యులకు ఇబ్బందులు
- బాధ్యతారహిత అధికారులపై చర్యలకు డిమాండ్
సిద్దిపేట క్రైం, నవంబర్ 5: ప్రజలకు సేవ చేయాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది తమ వద్దకు వచ్చే బాధితుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులకు వెళ్లే సామాన్యులు నిర్లక్ష్యం, అవమానకరమైన మాటతీరును ఎదుర్కొంటున్న ఘటనలు సిద్దిపేట(Siddipet) జిల్లాలో చర్చనీ యాంశంగా మారుతున్నాయి.
ప్రజల సమస్యలను ఓపికగా విని పరిష్కరించాల్సిన అధికారులు, బాధితుల పట్ల చిన్నచూపు ప్రదర్శించడం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల బండచర్లపల్లి, గజ్వేల్ ప్రాంతాల్లో భూ సమస్యలపై వినతులు తెలిపేందుకు వచ్చిన రైతులు, బాధితుల పట్ల రెవెన్యూ అధికారులు దురుసుగా మాట్లాడినట్లు ఆరోపణలు రావడంతో స్థానికంగా చర్చ మొదలైంది. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులే ఇలా వ్యవహరిం చడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితులతో మర్యాదగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదుదారుల సమస్యలను శ్రద్ధగా విని, చట్టప్రకారం పరిష్కరించాలని సూచించారు. అయినప్పటికీ కొం దరు అధికారుల తీరు మారడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బా ధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న అధికారులు ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, దురుసుగా ప్రవర్తించే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫిర్యాదు చేసే అవకాశం
ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో అధికారులు లేదా సిబ్బంది దురు సుగా ప్రవర్తించినా, విధుల్లో నిర్లక్ష్యం చేసినా బాధితులు సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఫిర్యాదును రాతపూర్వకంగా సమర్పించి, అందుబాటులో ఉన్న ఆధారాలను జతచేయడం ద్వారా సమస్యపై విచారణ కోరవచ్చు.
ఆరోపణలు విచారణలో నిర్ధారణ అయితే సంబంధిత నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ప్రజలకు సేవ చేయడం అధికారుల బాధ్యత. సమస్యలతో వచ్చే బాధితులను గౌరవంగా చూడడం, వారి ఫిర్యాదులను ఓపికగా వినడం ప్రతి ప్రభుత్వ ఉద్యోగి విధి. ప్రజలకు ఇబ్బందులు కలిగించే అధికారుల వ్యవహారశైలిపై ఉన్నతాధికారులు దృష్టి సారించి, బాధితులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.