ఆర్టీసీ బస్సు జాడేదీ?

30-10-2026 | 05:15am
  1. విద్యార్థులకు తప్పని తిప్పలు
  2. చోద్యం చూస్తున్న అధికారులు
  3. ‘హామీలకే పరిమితమైన ఆర్టీసీ చర్యలు

నంగునూరు, అక్టోబర్ 29: సిద్దిపేట జిల్లా(Siddipet District) నంగునూరు మండలంలోని అక్కెనపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రయాణ ఇబ్బందులపై విజయక్రాంతి వార్త కథనం ప్రచురించింది. స్పందించిన ఆర్టీసీ అధికారులు సంబంధిత రూట్ లో బస్సులో వెళ్లి పరిశీలించారు. సమస్య తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, త్వరలోనే అదనపు బస్సును కేటాయిస్తామని లేదా అదనపు ట్రిప్ను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చారు. కానీ, రోజులు గడుస్తున్నా నేటికీ ఆచరణలో ఎలాంటి మార్పు రాలేదు.

అధికారుల పరిశీలన కేవలం తూతూమంత్రంగానే మిగిలిపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణిస్తున్నారని తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వచ్చి చూసి వెళ్లారే తప్ప బస్సు జాడే కరువైంది అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు మండిపడుతున్నారు. ప్రమాదాలు జరిగితే గానీ అధికారులకు కనువిప్పు కలుగదా?అని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ప్రయాణికులకు మేలు

జిల్లాలోని మారుమూల ప్రాంతంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతంలోని అనేక గ్రామాల ప్రజలకు మేలు జరగనుంది. ఆర్టీసీ బస్సు సమయపాలన అనుకూలంగా రైతులు సాగు చేసే పంటలను గ్రా మాల నుంచి జిల్లా కేంద్రానికి తరలించడం సులభతరమవుతుంది. కూరగాయలు సాగు చేసే రైతులకు రవాణా సౌకర్యం లేక అవస్థలు తప్పడం లేదు. నంగునూరు మండల కేంద్రాన్ని అనుసంధానం చేస్తూ సిద్దిపేట వరకు బస్సును కొనసాగిస్తే ఈ ప్రాంతం ప్రయాణికులకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఆర్‌టిసి అధికారులు పలు మార్లు ఈ మార్గంలో బస్సు నడపాలనే విషయాన్ని గుర్తించి ప్రకటించినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. ప్రభుత్వ తప్పిదమా, అధికారుల నిర్లక్ష్యమా అనేది ప్రశ్నార్థకంగా మిగిలింది. 

మంత్రి సొంత జిల్లాలోనే..

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత జిల్లాలోనే విద్యార్థులు బస్సుల కోసం ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటుండటం గమనార్హం. సొంత జిల్లాలోని విద్యార్థులకు, ప్రయాణికులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయకపోవడం ఆయనకే అవమానకరమని నంగునూరు మండలంలో చర్చించుకుంటున్నారు.  ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి, మోడల్ స్కూల్ విద్యార్థుల రాకపోకలకు ప్రత్యేక బస్సును కేటాయించి సమస్యను వెంటనే పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సమస్యపై సిద్దిపేట ఆర్టీసీ డీఎంను వివరణ కోరగా బస్సులు లేవు, ఎక్కడి నుంచి తెమ్మంటారు? ఇబ్బందులు ఉంటే నేనేం చేస్తాను? అంటూ బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు