దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు 100 శాతం పూర్తి చేయాలి
ప్రతి పాఠశాలలో 3 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులకు స్క్రీనింగ్ తప్పనిసరి..
డీఈఓ బొల్లారం బిక్షపతి
ఆలేరు, నవంబర్ 4 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో దివ్యాంగ విద్యార్థుల గుర్తింపు కోసం చేపట్టిన ప్రత్యేక స్క్రీనింగ్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి(District Education Officer Bollaram Bhikshapati) ఆదేశించారు. బుధవారం రాయగిరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రశస్త్ (PRASHAST) యాప్‌పై మండల రిసోర్స్ పర్సన్లకు నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యూడైస్ సంఖ్య కలిగిన అన్ని విద్యాసంస్థల్లో 3 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు కూడా పూర్తి సహకారం అందించాలని కోరారు. గురువారం (నవంబర్ 5) మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు తప్పనిసరిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయకర్త పెసరు లింగారెడ్డి, జిల్లా రిసోర్స్ పర్సన్లు డాక్టర్ జి. శివరాజు, రామచంద్రు, ప్రత్యేక విద్య ఉపాధ్యాయులు, ఐఆర్పీలు, మండల రిసోర్స్ పర్సన్లు పాల్గొన్నారు.