సహపంక్తి భోజనం చేసిన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి

12-11-2026 | 10:19pm

ఉట్నూర్, నవంబర్ 12( విజయక్రాంతి ): ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారి–దీపావళి ఉత్సవాల్లో భాగంగా ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందం(ITDA Project Officer Manda Makarandam) వివిధ ఆదివాసీ గూడాలను సందర్శిస్తూ గిరిజనులతో మమేకమవుతున్నారు.

వారి జీవన విధానం, ఆచార వ్యవహారాలు, గోండి భాష, యాస, సంస్కృతి సంప్రదాయాలను ఆసక్తిగా తెలుసుకుంటూ వారితో ఆత్మీయంగా గడుపుతున్నారు. బుధవారం ఏజెన్సీ ప్రాంతంలోని పలు గిరిజన గ్రామాలను పర్యటిస్తూ.. దండారి ఉత్సవాల  ముగింపు పలికే కోలాబుడి కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఆదివాసీ దండారి డియుర్‌లతో కలిసి సంప్రదాయబద్ధంగా నేలపై కూర్చొని సహపంక్తి భోజనం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం అధికారిగా కాకుండా ఆదివాసీ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయి వారి సుఖదుఃఖాలు, సాధకబాధకాలు, గ్రామాల్లోని సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు  గోండి భాషలో మాట్లాడుతూ.. ఆయన చేస్తున్న ప్రయత్నం ఆదివాసీ సమాజంలో ఆనందాన్ని నింపుతోంది.

గతంలో ఆదివాసీ జీవన విధానాన్ని, సంస్కృతి సంప్రదాయాలను అధ్యయనం చేసిన ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్, బేటీ ఎలిజిబెత్ దంపతులు సైతం ఆదివాసీల మధ్య ఉంటూ వారి జీవన విధానాన్ని అర్థం చేసుకున్నారని,ఈ సందర్భంగా ఆదివాసీలు గుర్తుచేసుకుంటున్నారు. అదే తరహాలో ప్రాజెక్టు అధికారి మంద మకరందం గారు కూడా తమ మధ్యకు వచ్చి, తమ భాషను నేర్చుకుంటూ, తమ  తో మాట్లాడుతూ....

సంస్కృతిని గౌరవిస్తూ సమస్యలను తెలుసుకోవడం గొప్ప విషయమని ఆదివాసి పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా ఆదివాసీ సంప్రదాయాలను పరిరక్షించడంతో పాటు గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం, మారుమూల గిరిజన గ్రామాల సమగ్ర అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అధికారి–ప్రజల మధ్య దూరాన్ని తగ్గిస్తూ, ఆదివాసీల సంస్కృతిని గౌరవిస్తూ, వారి భాషలోనే వారి మనసును అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం నిజమైన ప్రజాసేవకు నిదర్శనం.

ఆదివాసీ సమాజంతో మమేకమవుతూ వారి అభివృద్ధి, విద్య, సంస్కృతి పరిరక్షణకు కృషి చేస్తున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందం గారికి ఆదివాసీ ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

మరిన్ని వార్తలు