జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి..
* గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఆత్రం సుగుణక్క వినతి...
* మూతపడిన గిరి ఇండస్ట్రీస్‌లను పునరుద్ధరించాలి..
* ఆశ్రమ పాఠశాలల్లో గిరి ఇండస్ట్రీస్ ఉత్పత్తులు అందించాలి...
* జంగుబాయి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రికి ఆహ్వానం...
ఉట్నూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): పుష్యమి మాసంలో జరిగే జంగుబాయి దేవత ఉత్సవాలకు ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించాలని కొమరం భీం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, రాయి సెంటర్ల జిల్లా గౌరవ అధ్యక్షులు మెస్రం దుర్గు, ఆదివాసీ నాయకులు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Lakshman Kumar), గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ సంతోష్ కుమార్ లకు వినతి పత్రాలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను హైదరాబాద్‌లో కుమురం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ఆధ్వర్యంలో పలువురు ఆదివాసీ పెద్దలు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగుభాయి దేవాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించి, ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రిని కోరారు. జంగుబాయి ఉత్సవాలకు హాజరుకావాలని మంత్రిని కోరారు.
అలాగే గిరిజన ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన గిరి ఇండస్ట్రీస్ ప్రస్తుతం కొన్ని మూతపడటంతో వాటిని తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గిరి ఇండస్ట్రీస్‌లో తయారయ్యే చిక్కీలు, సబ్బులు, షాంపూలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అందించాలని కోరారు. దీంతో గిరిజన ప్రాంతాల్లో స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు, ఆదివాసీ మహిళలు, యువతకు ఉపాధి లభిస్తుందని, గిరిజన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్లవుతుందని వివరించారు.
గిరిజన ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి గిరి ఇండస్ట్రీస్ పునరుద్ధరణ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వారి విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ మేడి మెస్రం దుర్గు, పురుక బాపూరావు, సలాం శ్యామ్ రావు, గిరి ఇండస్ట్రీస్ నిర్వాహకులు, పలువురు ఆదివాసీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.