మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో స్వయం ఉపాధికి ప్రోత్సాహం

17-11-2026 | 11:51pm
  1. మహిళా సంఘాలకు రూ.20 లక్షల వరకు రుణ సదుపాయం
  2. మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో 659 మందికి నూతన చేయూత పింఛన్లు
  3. 467 మహిళా సంఘాలకు రూ.35.25 కోట్ల రుణాల చెక్కుల పంపిణీ
  4. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క

మంగపేట/కన్నాయిగూడెం, నవంబర్ 17 (విజయక్రాంతి): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రతి ఒక్కరూ స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క(Telangana Minister Seethakka) పిలుపునిచ్చారు.

మంగళవారం ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  మైదానంలో 15 గ్రామ పంచాయతీలకు, రాజుపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో మరో 10 గ్రామ పంచాయతీలకు చెందిన లబ్ధిదారులకు నిర్వహించిన నూతన చేయూత పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు ఉత్తర్వులను అందజేశారు. రాజుపేటలో మహిళా సంఘాలకు రుణాల చెక్కులను కూడా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలను స్వయం సహాయక సంఘాల్లో చేర్చి ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే దృఢ సంకల్పంతో వారికి అనేక విధాలుగా ప్రయోజనాలు చేకూరేలా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు సంఘాల్లో చేరడం ద్వారా ఆర్థిక భరోసాతో పాటు పరస్పర సహకారం, ఐక్యత పెరుగుతాయని తెలిపారు. ప్రతి మహిళ స్వయం సహాయక సంఘంలో సభ్యత్వం పొందాలని సూచించారు.

స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వం ఉన్న మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుందని మంత్రి తెలిపారు. ఒక్కో మహిళా సంఘానికి రూ.20 లక్షల వరకు రుణాలు అందిస్తున్నామని, రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రుణాలకు సంబంధించిన వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం సంఘాల ఖాతాల్లో జమ చేస్తోందని వివరించారు.

ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన పేద మహిళలకు ఇంటి నిర్మాణం ప్రారంభించేందుకు అవసరమైన పెట్టుబడి సమకూర్చుకోవడం కష్టమవుతుందని మంత్రి తెలిపారు. అలాంటి మహిళలు స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉంటే బ్యాంకు రుణాల ద్వారా ఇంటి నిర్మాణాన్ని చేపట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ముఖ్యంగా ఇంటి పునాది నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయం పొందడంలో మహిళా సంఘాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. 

మహిళా సంఘాలు కేవలం రుణాలు పొందడానికే కాకుండా సభ్యులకు ఆపద సమయంలో అండగా నిలిచే వ్యవస్థలుగా పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. సంఘాల్లో సభ్యత్వం కలిగిన మహిళలు ప్రమాదవశాత్తు మరణించిన సందర్భంలో వారి కుటుంబాలకు రూ.10 లక్షల వరకు బీమా రక్షణ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళా సంఘాల్లో ఐక్యత, పరస్పర సహకారం పెంపొందించుకోవాలని సూచించారు.అర్హత కలిగిన నిరుపేద కుటుంబాలకు చేయూత పింఛన్లు అందించడం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. పింఛన్లు అందని అర్హులైన వారు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, వారి దరఖాస్తులను పరిశీలించి అర్హత మేరకు చర్యలు చేపడతామని పేర్కొన్నారు.

25 గ్రామ పంచాయతీల్లో 659 నూతన చేయూత పింఛన్లు

మంగపేట మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 659 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 146 మంది దివ్యాంగులు, 417 మంది వితంతువులు, 96 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. గ్రామ పంచాయతీల వారీగా అకినేపల్లి మల్లారంలో 15 మందికి, బాలన్నగూడెంలో 13 మందికి, బ్రాహ్మణపల్లిలో 17 మందికి, బుచ్చంపేటలో 17 మందికి, చెరుపల్లిలో 26 మందికి, చుంచుపల్లిలో 15 మందికి, దోమేడలో 22 మందికి, కమలాపూర్‌లో 118 మందికి, కతిగూడెంలో 8 మందికి, కోమటిపల్లిలో 33 మందికి, కొత్త మల్లూరులో 9 మందికి, కొత్తూరు మోట్లగూడెంలో 14 మందికి, మల్లూరులో 43 మందికి, మంగపేటలో 57 మందికి, నర్సాయిగూడెంలో 6 మందికి, నర్సాపూర్‌లో 33 మందికి, నరసింహసాగర్‌లో 45 మందికి, నిమ్మగూడెంలో 14 మందికి, పురెడుపల్లిలో 4 మందికి, రాజుపేటలో 39 మందికి, రామచంద్రునిపేటలో 18 మందికి, రమణక్కపేటలో 24 మందికి, తిమ్మంపేటలో 40 మందికి, వాగొడ్డు గూడెంలో 15 మందికి, వాడగూడెంలో 14 మందికి నూతన చేయూత పింఛన్లు మంజూరయ్యాయి.

467 మహిళా సంఘాలకు రూ.35.25 కోట్ల రుణాలు

మంగపేట మండలానికి చెందిన 467 స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ.35 కోట్ల 25 లక్షల రుణాలకు సంబంధించిన …

మరిన్ని వార్తలు