విద్య, క్రీడలకు సమ ప్రాధాన్యత: ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో
చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాల, లక్ష్మీనగరం బాలుర పాఠశాలను సందర్శించి పరిశీలన
ఏటూరునాగారం/ కన్నాయిగూడెం, నవంబర్ 17 (విజయక్రాంతి): గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు క్రీడల ద్వారా సమగ్ర అభివృద్ధికి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పో(ITDA PO Lenin Vatsal Toppo) క్షేత్రస్థాయి సందర్శనలు చేపట్టారు. ఈ క్రమంలో పీఓ తొలుత ఆశ్రమ హై స్కూల్ బాలికల ఆశ్రమ పాఠశాల, చిరుతపల్లి-Iను సందర్శించి విద్యార్థినులతో ముచ్చటించారు.
తరగతి గదిలో విద్యార్థులతో కలిసి చదివి, వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. విద్యార్థులు చదువుపై ఆసక్తి పెంపొందించుకోవాలని, సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యా బోధనతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించిన అంశాలను కూడా పరిశీలించారు. అనంతరం లక్ష్మీనగరం బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న డివిజన్ స్థాయి క్రీడా పోటీలను సందర్శించి, పోటీల నిర్వహణ తీరును పరిశీలించారు.
క్రీడల్లో పాల్గొనే విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పీడీలు, పీఈటీలకు సూచించారు. విద్యార్థులకు అవసరమైన సమయంలో గ్లూకోజ్ వాటర్ అందుబాటులో ఉంచాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే వైద్య సహాయం అందించేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.గిరిజన విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం అందించేందుకు ఐటీడీఏ నిరంతరం కృషి చేస్తుందని పీఓ లెనిన్ వత్సల్ టోప్పో మార్గదర్శకత్వంలో సంబంధిత అధికారులు తెలిపారు.