స్వీట్లు తింటున్నారా? సిల్వర్ ఫాయిల్‌తో జాగ్రత్త
స్వీట్లు, పాన్‌లలో నకిలీ వెండి.. హైదరాబాద్‌లో ముఠా అరెస్ట్!
హైదరాబాద్: స్వీట్లు, పాన్‌లపై మెరిసే వెండి పూత వెనుక కల్తీ దందా బయటపడింది. అసలైన వెండి స్థానంలో అల్యూమినియంతో నకిలీ సిల్వర్ ఫాయిల్స్(Fake Silver Foil) తయారు చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్(Hyderabad Police) పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో నలుగురిని అరెస్టు చేసి భారీగా నకిలీ ఫాయిల్స్, ముడిసరుకును స్వాధీనం చేసుకున్నారు.
అల్యూమినియంతో నకిలీ వెండి తయారీ
నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నకిలీ సిల్వర్ ఫాయిల్స్ తయారీ కేంద్రాలపై పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. స్వీట్లు, పాన్‌లలో ఉపయోగించే వెండి రేకుల స్థానంలో అల్యూమినియం రేకులను వినియోగిస్తూ నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 49 బండిళ్ల నకిలీ సిల్వర్ ఫాయిల్స్, 13 కిలోలకు పైగా అల్యూమినియం ప్లేక్స్, కిలో నకిలీ షుగర్ బాల్స్‌తో పాటు పొగాకు, టాల్కమ్ పౌడర్, పాన్ చట్నీలను స్వాధీనం చేసుకున్నారు.
బేకరీలు, స్వీట్ షాపులకు సరఫరా
తక్కువ ఖర్చుతో అల్యూమినియం రేకులను తయారు చేసి వాటిని అసలైన వెండిగా చూపిస్తూ బేకరీలు, స్వీట్ షాపులు, పాన్ షాపులకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేకులు, స్వీట్లు, పాన్‌ల అలంకరణలో వీటిని ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు.
ఆరోగ్యానికి ముప్పు
ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్(CP Mahesh Bhagwat) మాట్లాడుతూ.. ఆహార పదార్థాల్లో అసలైన వెండికి బదులుగా అల్యూమినియం ఉపయోగించడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఇలాంటి పదార్థాల వినియోగం వల్ల కిడ్నీలు, నాడీ వ్యవస్థ, ఎముకలు, జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందన్నారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే ఇలాంటి అక్రమ వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.