సోనియా ఆత్మకథపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

17-11-2026 | 04:44pm

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ఆత్మకథ(Sonia Gandhi Autobiography)లో తెలంగాణ ప్రస్తావన లేకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తీవ్రంగా స్పందించారు. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ఇచ్చిన బహుమతి కాదని, ప్రజల సుదీర్ఘ పోరాటం, త్యాగాల ఫలితమని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను కాంగ్రెస్ ఎప్పటికీ చెరిపివేయలేదని వ్యాఖ్యానించారు.

మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన కేటీఆర్.. సోనియాగాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ ఎప్పుడూ రాజకీయ ప్రయోజనాల కోణంలోనే చూసిందని విమర్శించారు. ఉద్యమ తీవ్రతను చూసి రాజకీయంగా నష్టపోతామనే భయంతోనే రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించారని ఆరోపించారు.

మూసీ నదిలో పది టీఎంసీల నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, ఆ నీటిని హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు ఎందుకు వినియోగించకూడదని కేటీఆర్ ప్రశ్నించారు. కరవు పరిస్థితులు నెలకొన్న సమయంలో మూసీ సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చివరి వంద రోజుల్లో హడావుడి చేసి ప్రజలను ఆకట్టుకోవచ్చనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్(KCR) ప్రభుత్వం మూడేళ్లలో పూర్తి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మూడేళ్లలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ సాధించిందంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. డీపీఆర్‌లు వెనక్కి రావడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని విమర్శించారు. అసెంబ్లీలో తనపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలకు సంబంధించి రెండు నెలలు గడిచినా ఆధారాలు బయటపెట్టలేదని అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్ విస్తీర్ణంపై గతంలో చేసిన ఆరోపణలకు, ప్రస్తుతం చెబుతున్న వివరాలకు పొంతన లేదని వ్యాఖ్యానించారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన రాజకీయ శత్రువని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, ఉద్యమకారుల త్యాగాలను విస్మరించి కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పనితీరును ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తమ తీర్పు చెబుతారని పేర్కొన్నారు. సోనియాగాంధీ ఆత్మకథ నుంచి మొదలైన కేటీఆర్ విమర్శలు.. మూసీ, కాళేశ్వరం, కాంగ్రెస్ పాలన వరకు కొనసాగాయి.

మరిన్ని వార్తలు