లాడ్జి వద్ద యువకుల మధ్య ఘర్షణ.. ఒకరి మృతి!
- - చిన్న వివాదం.. బలిగొన్న ప్రాణం
- - భద్రాచలం పట్టణంలో కలకలం రేపిన ఘటన
- - లాడ్జి,ఏరియా ఆసుపత్రి వద్ద బంధువులు, ఆదివాసీ సంఘాల ఆందోళన
- - రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
- - వివాదానికి కారణమైన లాడ్జి సీజ్
- - ఘర్షణకు పాల్పడిన యువకులు పోలీసుల అదుపులోకి?
భద్రాచలం, నవంబర్ 17 (విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) పట్టణంలో యువకుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర విషాదానికి దారితీసింది. పట్టణంలోని వంద గదుల సత్రం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జి వద్ద సోమవారం రాత్రి జరిగిన వాగ్వివాదం కాస్తా భౌతిక దాడులకు దారితీయడంతో తెల్లం శరత్ (22) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్వల్ప వివాదం చిలికి చిలికి గాలివానగా మారి చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలిగొనడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది.
-- లాడ్జి వద్ద మొదలైన వివాదం
వివరాల్లోకి వెళితే.. తెల్లం శరత్ తన స్నేహితులైన కుర్సం ప్రశాంత్, కీసర కార్తీక్‌లతో కలిసి సోమవారం రాత్రి పట్టణంలోని 100 గదుల సత్రం సమీపంలో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జి వద్దకు వెళ్లాడు. అక్కడ గది కావాలని లాడ్జి యాజమాన్యం, సిబ్బందిని సంప్రదించారు. ఈ క్రమంలో గది అద్దెకు సంబంధించిన బేరసారాలు, వ్యక్తిగత గుర్తింపు ఆధారాల సమర్పణ అంశంపై మాటామాటా పెరిగినట్లు తెలుస్తోంది. ఈ వివాదం కాస్తా తీవ్ర వాగ్వివాదానికి దారితీసి, చివరకు యువకుల మధ్య భౌతిక దాడులు చోటుచేసుకున్నాయి.
-- ఆసుపత్రికి తరలించేలోపే మృతి
ఈ ఘర్షణలో శరత్ తీవ్ర అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో స్థానికులు వెంటనే అతడిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో లాడ్జి వద్ద చోటుచేసుకున్న ఘర్షణ విషాదాంతంగా మారింది. 22 ఏళ్ల యువకుడు మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
లాడ్జి,ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత.. పోలీసుల మోహరింపు
ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న భద్రాచలం పోలీసులు వెంటనే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం ఘర్షణ జరిగిన లాడ్జి వద్దకు వెళ్లి సంఘటనకు సంబంధించిన పరిస్థితులను పరిశీలించడంతో పాటు ఆధారాలను సేకరించారు. మరోవైపు శరత్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, ఆదివాసీ సంఘాలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. పోస్టుమార్టం కేంద్రం వద్ద ఆందోళనకు దిగడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రంగంలోకి దిగిన డీఎస్పీ, సీఐ
ఆసుపత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్, సీఐ సట్ల రాజు పోలీసు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా లాడ్జి ఎదుట బయటనుంచి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న లాడ్జిని సీజ్ చేయాలని డిమాండ్ చేయడంతో సర్పంచ్ పూనెం కృష్ణ దొర, తహసిల్దార్ రవికుమార్, పంచాయతీ కార్య నిర్వహణ అధికారి శ్రీనివాసరావు లాడ్జి యొక్క అనుమతి పత్రాలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీజ్ చేశారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన అనంతరం శరత్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
పోలీసుల అదుపులో నిందితులు?
ఈ ఘటనకు సంబంధించి ఘర్షణకు పాల్పడిన యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఘటనకు దారితీసిన అసలు కారణాలు, ఘర్షణలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. యువకుల మధ్య తలెత్తిన చిన్నపాటి వివాదం ఒకరి ప్రాణాలను బలిగొనడం భద్రాచలం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.