మీ అభిప్రాయం... మెరుగైన వైద్య సేవలకు మార్గం
- ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై మీ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియజేయండి...
- ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...
ఉట్నూర్, నవంబర్ 27( విజయక్రాంతి ): ఉట్నూర్ డివిజన్(Utnoor Division) కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అభిప్రాయాలను వాట్సాప్ ద్వారా తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) అన్నారు. శుక్రవారం ఆయన " మీ అభిప్రాయం మెరుగైన వైద్య సేవలకు మార్గం" అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, ఆసుపత్రి పరిశుభ్రత, వైద్యులు మరియు సిబ్బంది రోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు, రోగులకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఏవైనా నిర్లక్ష్యపు ఘటనలు చోటుచేసుకుంటున్నాయా అనే అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలుసుకోవాలని మీ ఎమ్మెల్యే గా కోరుతున్నానని అన్నారు.
ఆసుపత్రిలో వైద్యం పొందిన వారు, రోగుల సహాయకులు తమ అనుభవాలు, సమస్యలు, సూచనలను క్రింది వాట్సాప్ నంబర్‌కు మెసేజ్ రూపంలో తెలియజేయగలరు.
వాట్సాప్ నంబర్: 91 82971 87229..
ప్రజలు తెలిపే వివరాలు, వారి వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజల అభిప్రాయాలను సేకరించి, ఆసుపత్రిలో వైద్య సేవలు, పరిశుభ్రత మెరుగుపడేలా, రోగులకు మెరుగైన వైద్యం మరియు సౌకర్యాలు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు.