మూగజీవాల వైద్యంపై నిర్లక్ష్యపు నీడ!

27-11-2026 | 06:18pm
  1. కన్నాయిగూడెం మండలంలో అస్తవ్యస్తంగా పశువైద్య సేవలు!
  2. మండలంలో 10 వేలకు పైగా మూగజీవాలు.. వైద్య సేవలు అంతంతమాత్రమే!
  3. విధులకు డుమ్మా కొడుతున్న పశువైద్యుడు?
  4. సమావేశాలకే పరిమితమవుతున్న వైద్య సేవలు!
  5. ప్రైవేట్ వ్యక్తితో చికిత్స.. అర్హతలపై అనుమానాలు!
  6. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల పెంపకందారులకు తప్పని ఇబ్బందులు!
  7. పట్టించుకోని జిల్లా అధికారులు.. పశుపోషకుల ఆవేదన!

కన్నాయిగూడెం, నవంబర్, 27(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండలంలో పశువైద్య సేవల నిర్వహణపై(Management of Veterinary Services) తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిధిలో సుమారు 10 వేలకు పైగా మూగజీవాలు ఉన్నప్పటికీ వాటికి పూర్తిస్థాయిలో వైద్య సేవలు(Medical Services) అందుతున్నాయా? అనే ప్రశ్నలు పశుపోషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెల పెంపకంపై(Rearing of sheep, goats, cows, and buffaloes) ఆధారపడి అనేక కుటుంబాలు జీవనం సాగిస్తుండగా, అవసరమైన సమయంలో ప్రభుత్వ పశువైద్య సేవలు(Government Veterinary Services) అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

విధులకు డుమ్మా.. సమావేశాలకే పరిమితం?

పశువులకు అనారోగ్యం కలిగినప్పుడు వెంటనే స్పందించి వైద్య సేవలు అందించాల్సిన పశువైద్యుడు విధులకు సక్రమంగా హాజరవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల నిర్వహణ కంటే సమావేశాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పశువైద్యుడి సేవలు అవసరమైన సమయంలో అందుబాటులో లేకపోవడంతో పశుపోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.

ప్రైవేట్ వ్యక్తితో వైద్యం.. అర్హతలు ఉన్నాయా?

ప్రభుత్వ పశువైద్యుడి స్థానంలో ప్రైవేట్ వ్యక్తితో పశువులకు చికిత్స చేయిస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. సదరు వ్యక్తికి పశువులకు వైద్యం అందించే అర్హతలు ఉన్నాయా? వైద్య పరిజ్ఞానం ఎంతవరకు ఉంది? ప్రభుత్వ పశువైద్య సేవలు అందుబాటులో ఉండాల్సిన చోట ప్రైవేట్ వ్యక్తులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అర్హతలు లేని వ్యక్తుల ద్వారా చికిత్స అందిస్తే మూగజీవాల ఆరోగ్యానికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10 వేల మూగజీవాలకు వైద్యం అందేదెలా?

మండలంలో 10 వేలకు పైగా గొర్రెలు, మేకలు, ఆవులు, గేదెలు ఉన్న నేపథ్యంలో వాటికి నిరంతర వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం. పశువులకు జ్వరం, అంటువ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు తక్షణమే వైద్యం అందించాలి. ముఖ్యంగా గొర్రెలు, మేకలకు వ్యాధులు సోకినప్పుడు సకాలంలో చికిత్స అందకపోతే మందలోని ఇతర జీవాలకు కూడా వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉంది. ఆవులు, గేదెలకు వైద్యం అందకపోతే పాడి రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుంది.పశువుల పెంపకమే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలు అప్పులు చేసి వాటిని పోషిస్తుంటే, అవసరమైన సమయంలో వైద్యం అందకపోవడం వారి జీవనోపాధిపై ప్రభావం చూపుతోంది. ప్రభుత్వ పశువైద్యశాల ఉన్నప్పటికీ సేవలు సక్రమంగా అందకపోతే ఇక పశుపోషకులు ఎవరిని ఆశ్రయించాలనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జిల్లా అధికారులు ఇప్పటికైనా స్పందించాలి!

కన్నాయిగూడెం మండలంలో పశువైద్య సేవలపై వస్తున్న ఆరోపణలపై జిల్లా పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. పశువైద్యుడి విధుల హాజరు, వైద్యశాల నిర్వహణ, మందుల లభ్యత, క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తితో వైద్యం చేయిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలు వెలికితీయాలని కోరుతున్నారు.

10 వేలకు పైగా మూగజీవాల ఆరోగ్యం, వేలాది పశుపోషక కుటుంబాల జీవనాధారం ముడిపడి ఉన్న ఈ అంశాన్ని అధికారులు తేలికగా తీసుకోకూడదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికైనా జిల్లా అధికారులు కళ్లు తెరుస్తారా? కన్నాయిగూడెం మండలంలో పశువైద్య సేవలను గాడిలో పెడతారా? లేక ఇంచార్జి పాలన పేరుతో నిర్లక్ష్యం కొనసాగుతుందా? వేచి చూడాలి!..

మరిన్ని వార్తలు