సెంట్రింగ్ పనిలో విషాదం
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి
తరిగొప్పుల, నవంబర్ 27 (విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామానికి(Abdul Nagaram Village) చెందిన తీగుళ్ల అశోక్ వయసు 45 సోలిపూర్ గ్రామంలో సెంట్రింగ్ పనిలో నిమగ్నమై ఉన్నాడు. సెంట్రింగ్ బాక్స్ పైకి ఎత్తుతున్న సమయంలో ఇనుప రాడు ఇంటిపై ఉన్న కరెంటు తీగలకు తగిలింది. దీంతో విద్యుత్ షాక్ తగిలి అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ఘటనతో సోలిపూర్ తో పాటు అబ్దుల్ నాగారం గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిర్మాణ పనుల సమయంలో విద్యుత్ తీగల పట్ల అప్రమత్తంగా ఉండాలని, భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.