పాఠశాల పక్కనే విష సర్పాలు.. విద్యార్థుల్లో వణుకు
బోథ్, నవంబర్ 14 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని విజ్ఞాన్ ప్రైవేటు పాఠశాల సమీపంలో రెండు రక్తపింజర పాములు (Russell's Vipers) సంచరించడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం పాఠశాల పక్కన పాములు కనిపించడంతో విద్యార్థులు వెంటనే ప్రధానోపాధ్యాయుడికి తెలియజేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించింది.
వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ శాఖ బీట్ ఆఫీసర్ ఈశ్వర్, డ్రైవర్, వాచ్మెన్ శ్రీనివాస్ సహకారంతో పాములను పట్టుకున్నారు. అనంతరం వాటిని అడవిలో విడిచిపెట్టారు. పాఠశాల చుట్టూ వ్యవసాయ భూములు ఉండటంతో తరచూ పాములు సంచరిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. పాఠశాల సమీపంలో విష సర్పాలు కనిపించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.