కేంద్రం తీరును తప్పుబట్టిన సీఎం
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్లో నిర్వహిస్తున్న భారత్ సమిట్(Bharat Summit)కు విదేశాల నుంచి వెయ్యి మందికి పైగా ప్రతినిధులను ఆహ్వానించామని, అయితే వారిలో పలువురికి కేంద్ర ప్రభుత్వం వీసాలు(Central Government Visa Issue) మంజూరు చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆరోపించారు. ఈ పరిణామంపై ఆయన కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు.
ప్రస్తుతం దేశంలో ప్రజాస్వామ్యాన్ని(Democracy) పరిరక్షించాలని కోరుకునే వారు, ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచాలని భావించేవారు అనే రెండు వర్గాలు ఉన్నాయని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటుంటే, కొందరు మాత్రం ఎంపిక చేసిన వ్యక్తులకే ఆ హక్కు పరిమితం కావాలని భావిస్తున్నారని విమర్శించారు.
భిన్నాభిప్రాయాలకు, ప్రజాస్వామ్య చర్చలకు వేదిక కల్పించడమే భారత్ సమిట్ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతినిధుల భాగస్వామ్యంతో పలు కీలక అంశాలపై చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సదస్సును నిర్వహిస్తోందని తెలిపారు. మరోవైపు, విదేశీ ప్రతినిధుల వీసాలపై కేంద్ర విదేశాంగ శాఖ స్పందిస్తూ.. వీసాలకు సంబంధించిన నిర్ణయాలు ప్రతి దేశ సార్వభౌమాధికార పరిధిలోకి వస్తాయని వెల్లడించింది.