బాలల విద్యే దేశ భవిష్యత్తు: ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్
దమ్మపేట, నవంబర్ 14, విజయక్రాంతి): బాలల దినోత్సవాన్ని(Childrens Day) పురస్కరించుకుని దమ్మపేట మండల కేంద్రంలోని కొత్తపేట ప్రాథమిక పాఠశాలలో(Kothapeta Primary School) మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కక్కిరాల రమేష్ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(India's first Prime Minister, Pandit Jawaharlal Nehru) చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, పలకలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేసి బాలల దినోత్సవ శుభాకాంక్షలు(Happy Children's Day) తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ కార్పొరేట్ స్థాయి వసతులు, ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలతో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 27 లక్షల మంది విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించే పథకాన్ని అమలు చేస్తోందని పేర్కొన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు 10+2 విద్యా విధానాన్ని అమలు చేస్తోందని వివరించారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని, చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వనమాల శ్రీనివాసరావు, వార్డు సభ్యులు పానుగంటి లక్ష్మణ్ గౌడ్, కాంగ్రెస్ శ్రేణులు పిట్టల శ్రీనివాసరావు, అన్నవరపు నాగేంద్రరావు, ఉపాధ్యాయురాలు నాగమణి, అంగన్‌వాడీ టీచర్ గోళ్ళ సీతారావమ్మ తదితరులు పాల్గొన్నారు.