మద్యం అమ్మినా.. తాగినా రూ.లక్ష ఫైన్

14-11-2026 | 05:23pm

మంథని, నవంబర్ 13 (విజయక్రాంతి): మద్యం మహమ్మారిని అరికట్టి గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలనే లక్ష్యంతో మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డు కూచిరాజ్‌పల్లి ప్రజలు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామ కమిటీ పెద్దలు, ప్రజలు పార్టీలకు అతీతంగా సమావేశమై గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం (Total Alcohol Ban) విధిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించారు.

గ్రామంలో బెల్ట్ షాపుల నిర్వహణను పూర్తిగా నిషేధించాలని, ఎవరూ మద్యం విక్రయించకూడదని నిర్ణయించారు. ఈ మేరకు మంథని ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందజేసి, గ్రామంలో మద్యం విక్రయాలు జరగకుండా సహకరించాలని కోరారు. బెల్ట్ షాపుల కారణంగా యువత మద్యానికి బానిసలవుతున్నారని, కూలి పనులు చేసుకుని సంపాదించిన డబ్బును కుటుంబ అవసరాలకు వినియోగించకుండా మద్యానికి ఖర్చు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని గ్రామ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం కారణంగా కుటుంబాల్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని తెలిపారు.

గ్రామ కమిటీ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా మద్యం విక్రయించినా, సేవించినా రూ.లక్ష జరిమానా (Penalty) విధించాలని తీర్మానించారు. జరిమానా రూపంలో వసూలైన మొత్తాన్ని గ్రామ అభివృద్ధికి వినియోగిస్తామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చూస్తామని హెచ్చరించారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, కుటుంబాల సంక్షేమం, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి సహకరించాలని గ్రామ కమిటీ పెద్దలు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు దాసరి రాజయ్య, సభ్యులు కామణి రమేష్, మాదేశి శ్రావణ్ కుమార్, అంబటి నర్సింగ్, మిట్టపల్లి కిషోర్, నాగేల్లి జానీ, దూడపాక శ్రీధర్, నక్క వివేక్, అంబటి కొమురయ్య, అంబటి సదానందం, లోడీ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు మాదేశి పద్మ, యువజన సభ్యులు అంబటి సాయి, దాసరి కుమార్, కామణి వెంకటేష్, వేముల మధు, కామణి పవన్, మిట్టపల్లి సాయి, మాదేశి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు