వైద్యాధికారులకు సమ్మె నోటీసు అందించిన ఆశాలు
దమ్మపేట, నవంబర్ 03 (విజయక్రాంతి): దమ్మపేట, పట్వారిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య అధికారులకు ఆశా వర్కర్స్ యూనియన్(Asha Workers Union) మండల అధ్యక్షురాలు శారద, సిఐటియు నాయకులు మురహరి రఘుతో కలిసి సమ్మె నోటీసు అందించారు. ఈ సందర్భంగా శారద, రఘులు మాట్లాడుతూ ఆశ వర్కర్లు ఉదయం నుండి రాత్రి వరకు వివిధ రకాల పనులు నిర్వహిస్తున్నప్పటికీ కేవలం 9,900 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని, ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్ల నాయకత్వంతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలకై గత మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ అధికారులు, మంత్రుల దృష్టికి ఆశావర్కర్ల సమస్యలు తీసుకువెళ్లినప్పటికీ ఏ ఒక్క సమస్య గురించి పట్టించుకోలేదని, గత్యంతరం లేని పరిస్థితుల్లో డిసెంబర్ నెలలో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యురాలు సునీత, రాధా, నాగమణి, వరలక్ష్మి, ప్రమీల, కుమారి తదితరులు పాల్గొన్నారు.