ఇంటికో ఇంకుడు గుంత.. ప్రతి పొలానికీ కుంట
- ''జలసిరి'"తో ప్రతి వర్షపు చుక్కనూ ఒడిసి పట్టాలి
- జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా
కరీంనగర్, నవంబరు 3 (విజయ క్రాంతి): ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత, ప్రతి పొలానికీ పంటకుంట తవ్వడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని నివారించవచ్చని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా(District Collector Chitra Mishra) సూచించారు. జలసిరి కార్యక్రమం(Jalasiri Programme) ద్వారా ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టాలని అధికారులను ఆదేశించారు.
మంగళవారం కొత్తపల్లి మండలంలోని బద్దిపల్లిలో విబి జి రాంజీ కార్యక్రమం ద్వారా నిర్మించిన కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతను, నాగుల మల్యాల గ్రామంలో రైతు ఎడ్ల లత పొలం వద్ద నిర్మించిన పంట కుంటను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూగర్భ జలాల పెంపుదల, నీటి సంరక్షణ ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం జలసిరి కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు.
జిల్లాలో ఈ కార్యక్రమం కింద గుంతల నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచడం ద్వారా భవిష్యత్తులో నీటి కరువు రాకుండా చూడవచ్చని అన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలు, పంట పొలాల వద్ద పంట కుంటలు, ప్రభుత్వ భూముల్లో కమ్యూనిటీ వ్యవసాయ ఇంకుడు గుంతల నిర్మాణం శరవేగంగా సాగుతోందని తెలిపారు.
విబి జి రాంజీ కార్యక్రమం ద్వారా ఈ పనులు చేపడుతూ గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నామని తెలిపారు. జలసిరి ద్వారా నీటి వనరులు పెంపొందించేందుకు, రైతులకు మరింత మేలు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్ లో ప్రాథమిక ఆరోగ్య, ఎలగందుల గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని కలెక్టర్ సందర్శించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి ఎంపీడీవో శ్రీనివాస్, ఎం ఏ ఓ సంతోష్, మండల ప్రత్యేక అధికారి రణధీర్ కుమార్, హార్టికల్చర్ ఆఫీసర్ స్వాతి, ఇంజనీర్ స్పందన, విద్యాశాఖ కోఆర్డినేటర్ మిల్కూరి శ్రీనివాస్, ఎంఏవో ఆనందం, ప్రిన్సిపాల్ లు రమాదేవి, కే శ్రీనివాస్, సర్పంచులు శ్రీనివాస్, అంజయ్య, చంద్రకళ, నిమ్మల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.