స్వదేశానికి వెళ్తే హసీనాకు ఉరి తప్పదా..?
భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి స్వదేశానికి వెళ్లేందుకు కీలక ప్రయత్నాలు ప్రారంభించారు. డిసెంబర్లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లాలనే లక్ష్యంతో కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆమె తరఫున లండన్‌కు చెందిన మ్యాట్రిక్స్ ఛాంబర్స్ న్యాయవాదులు ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్‌కు (Bangladesh High Commission) లేఖ రాశారు. తన క్లయింట్‌కు కొత్త పత్రాలు వీలైనంత త్వరగా జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. 2024లో అధికారం కోల్పోయి భారత్‌కు వచ్చిన తర్వాత హసీనా అధికారికంగా పత్రాల కోసం ప్రయత్నించడం ఇదే తొలిసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నవంబర్ 9న హసీనా తరఫు న్యాయవాదులు బంగ్లాదేశ్ హైకమిషన్‌కు లేఖ పంపారు. గతంలో ఆమెకు జారీ చేసిన పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు (National Identity Card)లను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం, సంబంధిత అధికారులు రద్దు చేసినట్లు లేఖలో వెల్లడించారు. బంగ్లాదేశ్ పౌరురాలిగా ఆమెకున్న హక్కులు, అంతర్జాతీయ మానవ హక్కుల ఒప్పందాల ప్రకారం కొత్త పత్రాలు జారీ చేయాలని కోరారు. దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అవసరమైన ప్రక్రియ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో విద్యార్థుల నేతృత్వంలో జరిగిన భారీ ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచిపెట్టారు. అనంతరం భారత్‌కు చేరుకున్న ఆమె అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నారు. తాజాగా డిసెంబర్లో స్వదేశానికి తిరిగి వెళ్లి న్యాయస్థానం ఎదుట లొంగిపోవాలనే ఉద్దేశంతో కొత్త పత్రాల కోసం ప్రయత్నిస్తున్నట్లు ఆమె సహాయకులు వెల్లడించారు. తిరుగు ప్రయాణానికి సంబంధించిన కచ్చితమైన తేదీని అధికారిక ప్రక్రియలు పూర్తయిన తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.
అయితే హసీనా తిరుగు ప్రయాణ ప్రయత్నాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం భిన్నమైన వైఖరి అవలంబిస్తోంది. ఆమెకు కొత్త పాస్‌పోర్టు జారీ చేయాల్సిన అవసరం లేదని, భారత్‌తో ఉన్న అప్పగింత ఒప్పందం (Extradition Treaty) ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని కోరుతోంది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. న్యాయశాఖ మంత్రి ఎం.డి. అసదుజ్జమాన్ కూడా హసీనా అప్పగింత అంశం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే కొనసాగుతుందని తెలిపారు. దీంతో ఆమె కొత్త పత్రాల దరఖాస్తు, బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పగింత డిమాండ్ మధ్య ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
మరోవైపు హసీనాపై బంగ్లాదేశ్‌లో తీవ్రమైన న్యాయపరమైన కేసులు కొనసాగుతున్నాయి. 2024లో విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేసే క్రమంలో జరిగిన హింసకు సంబంధించి మానవత్వానికి వ్యతిరేకమైన నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (International Crimes Tribunal) 2025 నవంబర్‌లో ఆమెను దోషిగా నిర్ధారించింది. ఆమె గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. అయితే ఈ ఆరోపణలను హసీనా ఖండిస్తున్నారు. తనపై జరిగిన విచారణ, వెలువడిన తీర్పు చట్టబద్ధతను సైతం ప్రశ్నిస్తున్నారు.
హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం చేస్తున్న డిమాండ్, ఆమె భారత్‌లోనే కొనసాగుతుండటం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సవాలుగా మారాయి. ఇప్పటికే ఆమె భారత్‌కు వచ్చిన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు మరోసారి ద్వైపాక్షిక సంబంధాలను చర్చలోకి తీసుకొచ్చాయి.
హసీనాకు కొత్త పాస్‌పోర్టు, గుర్తింపు కార్డు లభిస్తాయా? బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమె దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? భారత్ అప్పగింత విషయంలో ఏ వైఖరి అనుసరిస్తుంది? అనే అంశాలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. డిసెంబర్లో ఆమె స్వదేశానికి తిరిగి వెళ్తారా లేదా అన్నది వేచి చూడాలి.