కార్తీక సోమవారం సందర్భంగా శివాలయాలకు పోటెత్తిన భక్తులు
దమ్మపేట, నవంబర్ 16(విజయ క్రాంతి): కార్తీక మాస మొదటి సోమవారం శివ, విష్ణు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర కార్తీక మాసం సోమవారం మండల పరిధి వడ్లగూడెం లోని శ్రీ భువనసుందరీ సమేత స్వయంభూ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం, మండల కేంద్రంలోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయాల్లో తెల్లవారుజాము నుండే భక్తులు బారులు తీరారు. తొలి సోమవారం కావడంతో ఆలయాల్లో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృత అభిషేకాలు, బిల్వ పత్రాలతో పూజలు నిర్వహించారు. కార్తీకమాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టత వుండడంతో మహిళలు ఆలయ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున దీపాలు వెలిగించారు. దర్శన అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
కోటి దీపోత్సవం
కార్తీకమాస మాస శివరాత్రి సందర్భంగా దమ్మపేట శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి శాంతి కల్యాణం, కోటి దీపోత్సవం కార్యక్రమం నిర్వహించబడుతుందని, కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం కార్యక్రమం నిర్వహించబడుతుందని ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని దేవాలయ చైర్మన్ పానకాల సత్యనారాయణ కోరారు.