ప్రైవేట్ భవనంలోనే బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం

16-11-2026 | 12:13pm

కార్యాలయంపై ఒకే ఒక్కడు ఆధిపత్యమంటూ ఆరోపణలు..?

ప్రభుత్వం ఆదేశించిన... ఆదేశాలు బేఖాతరు...

ప్రభుత్వ భవనం ఉండగా ప్రైవేట్ షట్టర్‌లో కార్యకలాపాలు ఎందుకు...?

అద్దె చెల్లింపులతో పాటు కార్యాలయ నిర్వహణ ఒకే ఒక్కడు చేతిలోనే...

పట్టించుకోని జిల్లా స్థాయి అధికారులు.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఏదీ...?

బాన్సువాడ,(విజయక్రాంతి): ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ భవనాల్లోనే కొనసాగించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ కామారెడ్డి జిల్లా(Kamareddy district) బాన్సువాడ పట్టణంలోని సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయం మాత్రం ప్రైవేట్ భవనం(Private Building)లోనే కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలను అమలు చేయాల్సిన కార్యాలయంలోనే ఆదేశాలు అమలుకు నోచుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు పారదర్శకంగా సేవలందించాల్సిన బాధ్యత కలిగి ఉంటాయి. కానీ కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ(Banswada Sub-Registrar Office) నిర్వహణ మాత్రం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ భవనంలోని షట్టర్‌లోనే కార్యాలయ కార్యకలాపాలు కొనసాగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ భవనం ఉండగా ప్రైవేట్ భవనంలో కార్యాలయం ఎందుకు కొనసాగించాల్సి వస్తోంది? ఈ వ్యవహారానికి అనుమతులు ఎవరిచ్చారు? అద్దె చెల్లింపులు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ప్రజాధనంతో నడిచే ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో పారదర్శకత తప్పనిసరి. బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎప్పుడు స్పందిస్తారు? ప్రభుత్వ భవనం వినియోగంలోకి ఎప్పుడు వస్తుంది? ఆరోపణలపై విచారణ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అన్నది వేచి చూడాల్సిందే.

ప్రభుత్వ భవనం ఉండగా ప్రైవేట్ భవనం ఎందుకు...?

ప్రభుత్వానికి సొంత భవనం అందుబాటులో ఉందన్న వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రైవేట్ భవనంలో కొనసాగించాల్సిన అవసరం ఏమిటన్నది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణకు సంబంధించి ఉన్నతాధికారుల ఆదేశాలు, నిబంధనలు ఉన్నప్పటికీ వాటి అమలు విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందా? లేక ప్రత్యేక అనుమతులతోనే ప్రైవేట్ భవనంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? అన్న విషయాలు తేలాల్సి ఉంది.

అద్దె చెల్లింపులపై లెక్కలేవి...?

ప్రైవేట్ భవనానికి సంబంధించిన అద్దె ఒప్పందం ఎవరితో కుదిరింది? నెలవారీ అద్దె ఎంత? అద్దె చెల్లింపులు ప్రభుత్వ ఖాతా నుంచే జరుగుతున్నాయా? సంబంధిత అనుమతులు, బిల్లులు, రికార్డులు ఉన్నాయా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కార్యాలయ నిర్వహణతో పాటు అద్దె చెల్లింపుల వ్యవహారంలోనూ ఒకే వ్యక్తి కీలక పాత్ర పోషిస్తున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవమెంత? అధికారికంగా ఎవరి బాధ్యత ఎంత? అన్నది విచారణలో వెల్లడించాల్సి ఉంది.

ఒక్కరి చేతిలోనే కార్యాలయ వ్యవహారాలా...

ప్రభుత్వ శాఖకు సంబంధించిన కార్యాలయ నిర్వహణలో నిబంధనల ప్రకారం అధికారుల పర్యవేక్షణ ఉండాల్సి ఉంటుంది. అయితే బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించి నిర్వహణ, అద్దె వ్యవహారాలు ఒకే వ్యక్తి ఆధీనంలో కొనసాగుతున్నాయన్న ఆరోపణలు చర్చకు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయ వ్యవహారాల్లో వ్యక్తిగత ఆధిపత్యానికి అవకాశం ఎలా ఏర్పడింది? సంబంధిత శాఖ అధికారులు ఈ పరిస్థితిని ఎందుకు సమీక్షించడం లేదు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

జిల్లా అధికారులకు తెలియదా? తెలిసినా మౌనమేనా...

సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయానికి సంబంధించిన భవనం, అద్దె, నిర్వహణ అంశాలు జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల పరిధిలో సమీక్షకు రావాల్సినవే. అయినప్పటికీ ఈ వ్యవహారంపై ఇప్పటివరకు స్పష్టమైన వివరణ వెలువడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉందా? తనిఖీలు నిర్వహించారా? ప్రభుత్వ భవనం వినియోగంలో లేకపోవడానికి కారణాలేమిటి? అన్న అంశాలపై సమాధానాలు రావాల్సి ఉంది.

ఉన్నతాధికారులు స్పందించాలి.. విచారణ జరిపించాలి

బాన్సువాడ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ప్రభుత్వ భవనంలోకి మార్చే అవకాశాలను పరిశీలించడంతో పాటు ప్రైవేట్ భవనంలో కొనసాగుతున్న కార్యకలాపాలకు సంబంధించిన అనుమతులు, అద్దె ఒప్పందాలు, చెల్లింపుల వివరాలను బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలి. ప్రభుత్వ ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అన్నది పరిశీలించాలి. ప్రభుత్వ భవనం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రైవేట్ భవనానికే ప్రాధాన్యం ఇవ్వడం వెనుక కారణాలను ప్రజలకు వెల్లడించాలి.

మరిన్ని వార్తలు