అక్రమంగా చెట్ల నరికివేత?
కేసముద్రం, నవంబర్ 15 (విజయక్రాంతి): పర్యావరణ హితం(Environment-friendly) కోసం కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు, అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ భారీ వృక్షాలను ఉన్నఫలంగా తొలగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో ప్రభుత్వ హాయంలో నాటిన మొక్కలు వటవృక్షాలుగా మారి ప్రజలకు నీడనిస్తుండగా, వివిధ కారణాలతో తాజాగా ఆ చెట్లను తొలగిస్తున్నారని, ఇప్పటికే కేసముద్రం పట్టణంలో వందల కొలది చెట్లు రోడ్ల విస్తరణ కార్యక్రమంలో కనుమరుగయ్యాయని, ఉన్న వాటిని కూడా పరిరక్షించాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలోని అమీనాపురం పాత గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఉన్న చెట్లను అక్రమంగా నరికి వేశారని, ఈ సంఘటనపై తక్షణం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు ఆరవ వార్డు కౌన్సిలర్ పాయిరాల శరత్ యాదవ్ చెప్పారు.
ఆరవ వార్డు పరిధిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ ఆవరణలో ఉన్న భారీ రావిచెట్టు, నిద్ర గన్నేరు చెట్లను వార్డు కౌన్సిలర్ అయిన తనకు తెలియకుండా, చైర్ పర్సన్ బానోత్ సునీత లేఖ ఆధారంగా చేసుకొని వేముల శ్రీనివాస్ అనే వ్యక్తి పర్యావరణ పరిరక్షణకు విరుద్ధంగా చెట్లను నరికి విక్రయించుకున్నాడని ఆరోపించారు. చెట్ల వల్ల ఎవరికి నష్టం లేకున్నప్పటికీ, తొలగించడం సరైనది కాదన్నారు. ఈ విషయంపై అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అనుమతులతోనే చెట్లు తొలగించాం
అమీనా పురం పరిధిలో భారీగా పెరిగిన చెట్ల వల్ల కోతుల బెడద పెరిగిందని, చెట్ల వేర్లు ఇండ్లలోకి వచ్చి ఇండ్లు దెబ్బతింటున్నాయని ప్రజలు ఫిర్యాదు చేయ డంతోనే చెట్ల తొలగింపుకు నిర్ణయిం చాం. అటవీ శాఖ అనుమతితో చెట్ల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. చెట్ల తొలగింపుకు అవసరమైన ఖర్చులు పోను మిగిలిన డబ్బులను మున్సిపాలిటీలో జమ చేయాలని తీర్మానించాం. ఇందులో స్వార్థపూరితమైన అంశం ఏదీ లేదు. కావాలని రాజకీయం చేయడం సరికాదు. వ్యక్తిగత ప్రయోజనానికి ఈ అంశాన్ని జోడించడం సరైనది కాదు.
బానోత్ సునిత, చైర్ పర్సన్, కేసముద్రం మున్సిపాలిటీ