కోటి జన్మల పాపాలు తొలగాలంటే ఇలా చేయండి

16-11-2026 | 08:40am

విజయక్రాంతి ఆధ్యాత్మికం: కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారానికి హిందూ సంప్రదాయంలో విశేష ప్రాధాన్యం ఉంది. శ్రవణ నక్షత్రం, సప్తమి తిథి కలిసి వచ్చే ఈ పవిత్రమైన రోజున శివుడిని ఆరాధిస్తే విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ రోజున భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు నిర్వహించడం వల్ల కోటి జన్మల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు.

తెల్లవారుజామునే పవిత్ర స్నానం

కోటి సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదీస్నానం ఆచరించడం శుభప్రదంగా భావిస్తారు. నదికి వెళ్లే అవకాశం లేనివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని పవిత్ర స్నాన సంకల్పం చేసుకోవచ్చు. అనంతరం శుభ్రమైన వస్త్రాలు ధరించి శివుడిని మనస్ఫూర్తిగా స్మరించుకోవాలి.

ఉపవాసం.. దీపారాధనతో శివుడి పూజ

ఈ రోజున వీలైనవారు ఉపవాసం పాటిస్తూ శివాలయాలను దర్శించుకోవాలని పండితులు సూచిస్తున్నారు. శివలింగానికి అభిషేకం నిర్వహించి బిల్వదళాలు సమర్పించడం, దీపారాధన చేయడం, శివనామ స్మరణ చేయడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత కలుగుతుందని ఆధ్యాత్మిక గురువులు వివరిస్తున్నారు.

దీపదానం, అన్నదానానికి ప్రత్యేకత

కార్తీక మాసంలో దీపదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కోటి సోమవారం రోజున శివాలయాల్లో దీపాలు వెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి సత్కార్యాలు ఆచరించాలని సూచిస్తున్నారు. ఈ పవిత్ర దినాన చేసే దానధర్మాలు విశేష పుణ్యాన్ని అందిస్తాయని భక్తుల నమ్మకం. భక్తి, దానం, సేవాభావంతో ఈ రోజును గడపడం శుభప్రదంగా భావిస్తారు.

మరిన్ని వార్తలు