అమీన్పూర్లో అక్రమ కట్టడాల దందా!
- మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్న అధికారి ?
- అధికారి కనుసన్నల్లో వసూల్ రాజాలుగా చైన్మెన్లు
- బిల్డర్లతో కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్న వైనం
- మున్సిపల్ ఆదాయానికి భారీగా గండి..
అమీన్పూర్, నవంబర్ 15 : హైదరాబాద్ శివారు ప్రాంతమైన అమీన్పూర్ మున్సిపాలిటీ అక్రమ కట్టడాలకు(Municipality Faces Illegal Construction) అడ్డాగా మారింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న ఈ ప్రాంతంలో నిబంధనలకు నీళ్లొదిలి బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. కంచే చేను మేసినట్లుగా, అక్రమాలను అడ్డుకోవాల్సిన మున్సిపల్ అధికారులే మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అనుమతులు ఒకలా.. నిర్మాణాలు మరోలా
మున్సిపల్ పరిధిలోని పలు కాలనీలు, ప్రధాన రహదారుల పక్కన నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు వెలుస్తున్నాయి. జీ ప్లస్ 2 లేదా జీ ప్లస్ 3 అంతస్తులకు మాత్రమే అనుమతులు పొందుతున్న బిల్డర్లు, అదనంగా మరో రెండు మూడు అంతస్తులను నిర్మిస్తున్నారు. భవన నిర్మాణ నిబంధనల ప్రకారం వదలాల్సిన సెట్బ్యాక్లను ఎక్కడా వదలడం లేదు. రోడ్లను ఆక్రమించి మరీ పిల్లర్లు వేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
చక్రం తిప్పుతున్న ఆ అధికారి ఎవరు?
అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి అన్నీ తానై చక్రం తిప్పుతున్నట్లు స్థానికంగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న సదరు అధికారి, అక్రమార్కులతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు సమాచారం. కొత్తగా నిర్మాణం చేపట్టే ప్రతి బిల్డర్ నుండి అంతస్తుల లెక్కన భారీ మొత్తంలో ‘మామూళ్లు’ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ముడుపులు ముట్టజెప్పిన వారి భవనాల వైపు కన్నెత్తి కూడా చూడని అధికారులు, సామాన్యులు చిన్నపాటి మరమ్మతులు చేసుకున్నా నిబంధనల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పుడు మొక్కుబడిగా నోటీసులు జారీ చేసి, ఆ తర్వాత సెటిల్మెంట్లు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి..
అక్రమ కట్టడాల వల్ల మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అనుమతులు లేకుండా నిర్మిస్తున్న అదనపు అంతస్తుల వల్ల భవన నిర్మాణ రుసుము రూపంలో ప్రభుత్వానికి కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. అంతేకాకుండా, భవిష్యత్తులో డ్రైనేజీ, తాగునీరు, ట్రాఫిక్ వంటి మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
అమీన్పూర్ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ అక్రమాల పర్వంపై జిల్లా కలెక్టర్, మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు అధికారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.