సీపీఎస్ రద్దు కోసం రేపు సామూహిక సెలవు
- రాష్ట్రవ్యాప్తంగా ఒక్క రోజు ధర్మదీక్షలు
- 2.15 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఉద్యమ గర్జన
- ఇప్పటికే 1.50 లక్షలకు పైగా సెలవు దరఖాస్తులు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(Contributory Pension Scheme) (సీపీఎస్) రద్దు చేసి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను పునరుద్ధరించాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయులు మరో ఉద్యమ కార్యాచరణకు సిద్ధ మయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రకటించి మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా..
నవంబర్ 17న (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల మంది సీపీఎస్ ఉద్యో గ, ఉపాధ్యాయులు సామూహిక సెలవు ప్రకటించడంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ఎత్తున ధర్మదీక్షలు చేపట్టనున్నారు. ఇప్పటికే 1.50 లక్షలకు పైగా ఉద్యోగులు సామూహిక సెలవు కోసం దరఖాస్తులు సమర్పించారని, ఇది ఉద్యమానికి లభిస్తున్న విశేష స్పందనకు నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూని యన్ (టీఎస్ సీపీఎస్‌ఈయూ) వెల్లడించింది.
సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 23న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభ తీర్మానాలతోపాటు, నవంబర్ 17న చేపట్టే సామూహిక సెలవు ఉద్యమ తీర్మానాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుకు గత సెప్టెంబర్ 17న యూనియన్ నాయకులు అందజేశారు.
ఇందులో భాగంగానే మంగళవారం సామూహిక సెలవుకు వారంతా సిద్ధమవుతున్నారు. కాగా, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తన సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించడంతో పాటు, మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే ధర్మదీక్షలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు. ప్రతి సీపీఎస్ ఉద్యోగి, ఉపాధ్యాయుడు సామూహిక సెలవులో పాల్గొని, జిల్లా కేంద్రాల్లో నిర్వహించే ధర్మదీక్షలకు భారీ సంఖ్యలో తరలిరావాలని ఇప్పటికే నాయకులు పిలుపునిచ్చారు.
నెలకు రూ.5 వేలు కూడా రాని పెన్షన్
రాష్ట్రంలో ఇప్పటికే 5వేల మందికి పైగా సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేయగా, సీపీఎస్ అమలుతో వారిలో ఒకొక్కరికి నెలకు రూ.5 వేలు కూడా పెన్షన్ అందడంలేదు. పదవీ విరమణ అనంతరం పెన్షనర్ గుర్తింపు కార్డు లేకపోవడంతో వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో ఉద్యోగ జేఏసీ సంఘాల నాయకులతో జరిగిన చర్చల్లో మూడు నెలల గడువుతో సీపీఎస్ రద్దుకు ప్రత్యేక అధ్యయన కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అయితే ఇప్పటివరకు ఆ హామీ కార్యరూపం దాల్చడం లేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కమిటీ ఏర్పాటు చేయడమే కాకుండా, సీపీఎస్ రద్దుకు స్పష్టమైన కాలపరిమితిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
కాంగ్రెస్ హామీని నిలబెట్టుకోవాలి: స్థితప్రజ్ఞ
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో గతంలోనే సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించారని నేషనల్ మూవ్‌మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌ఎంఓపీఎస్) సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ తెలిపారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళం రాష్ట్రాల్లోనూ పాత పెన్షన్ పునరుద్ధరణ ఉద్యోగుల ప్రధాన ఆకాంక్షగా ఉందన్నారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించడం తగదని, తెలంగాణ ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల తరహాలో సీపీఎస్ రద్దు దిశగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకొని సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించాలని కోరారు.
భద్రత ఏదీ?: కల్వాల్ శ్రీకాంత్
ఒక సీపీఎస్ ఉద్యోగి తన వేతనంలో 10 శాతం పెన్షన్ కోసం ప్రాన్ (పీఆర్‌ఏఎన్) ఖాతాలో జమ చేస్తున్నారని సీపీఎస్‌ఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్ పేర్కొన్నారు. దీనికి అదనంగా ఈహెచ్‌ఎస్ కోసం మరో 1.5 శాతం కోత విధిస్తున్నారని తెలిపారు. మొత్తంగా 11.5 శాతం ఆర్థిక భారం భరిస్తున్నప్పటికీ, పదవీ విరమణ తర్వాత గౌరవప్రదమైన పెన్షన్ లేదని.. సరైన వైద్య భద్రత లేదని.. ఇది ఉద్యోగులపై జరుగుతున్న తీవ్ర అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు.
నవంబర్ 17.. ఉద్యమ కార్యాచరణ...
* రాష్ట్రంలో మొత్తం సీపీఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు: 2,60,000 మంది
* అత్యవసర సేవల మినహాయింపు: 45,000 మంది
* సామూహిక సెలవులో పాల్గొనే వాళ్లు: 2,15,000 మంది
* ఇప్పటికే నమోదైన సెలవు దరఖాస్తులు: 1,50,000 పైగా
* డిమాండ్: సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయడం