అభివృద్ధికి నక్సలైట్లే అడ్డు!
- గిరిజనులను అభివృద్ధికి దూరం చేసింది వాళ్లే
- ప్రధాని మోదీ వల్లే గూడేంలలో వెలుగులు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- పోడు భూముల హామీలేమయ్యాయి?: బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు
- జన్‌జాతీయ గౌరవ దివస్‌లో బిర్సా ముండాకు నివాళులు
హైదరాబాద్, నవంబర్ 15 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల్లో(tribal areas) అభివృద్ధిని ఇన్నాళ్లు నక్సలైట్లే అడ్డుకున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy) పేర్కొన్నారు. అలాంటి ఆటంకవాదులను నిర్మూలించి ఆ ప్రాం తాల్లో అభివృద్ధికి బాటలు వేయడం మోదీ ప్రభుత్వంతోనే సాధ్యమైందని ఆయన చెప్పారు.
నక్సలిజం నిర్మూలనకు, బాధితుల పునరావాసానికి, గిరిజన ప్రాంతాల ప్రగతికి కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి సందర్భంగా బీజేపీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం జన్‌జాతీయ గౌరవ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు, ఎంపీలు డాక్టర్ కే లక్ష్మణ్, ఈటల రాజేందర్ ఇతర నాయకులు భగవాన్ బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాను కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఒక గొప్ప చారిత్రాత్మక ఘట్టానికి సాక్షిగా నిలిచానని గుర్తు చేసుకున్నారు.
బ్రిటిష్ పాలకులు బిర్సా ముండాను బంధించిన రాంచీలోని పాత సెంట్రల్ జైలును ఆయన త్యాగాలకు గుర్తుగా ఒక అద్భుతమైన స్మారక మ్యూజియంగా తీర్చిదిద్డినట్లు పేర్కొన్నారు. 2021 నవంబర్ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఆ మ్యూజియాన్ని జాతికి అంకితం చేశారని, ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నానని కిషన్‌రెడ్డి తెలిపారు.
75 యేండ్లుగా మారుమూల గిరిజన గూడెంలకు ఏ ప్రభుత్వ అధికారి కూడా వెళ్లలేదని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సరిగ్గా అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు మహిళలు, కుటుంబాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. రేషన్ బియ్యంతోపాటు మౌలిక వసతులు, విద్య, నివాస సౌకర్యాలు కల్పిస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని వెల్లడించారు.
హామీలు నెరవేర్చని బీఆర్ఎస్, కాంగ్రెస్: రాంచందర్‌రావు
తెలంగాణలో గిరిజనులకు గత ప్రభుత్వం గానీ, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు విమర్శించారు. పోడు భూముల సమస్యపై ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పోడు భూములను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఎస్టీ రిజర్వేషన్ల పెంపు, వాటి అమలులో జరుగుతున్న జాప్యాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్ హక్కుల కోసం బిర్సా ముండా వీరోచిత పోరాటం చేశారని కొనియాడారు. అప్పటి బీహార్, నేటి జార్ఖండ్ ప్రాంతంలో ఆదివాసీలు, గిరిజనుల హక్కుల రక్షణ కోసం అలుపెరగని పోరాటం సాగించి, ఆ ప్రజలందరి హృదయాల్లో భగవాన్‌గా నిలిచిపోయారని గుర్తుచేశారు.