నీటి కుండీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి

16-11-2026 | 12:06pm

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ గ్రామం(Mallapur Village)లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పశువుల నీటి కుండీలో పడి ఆరేళ్ల బాలుడు మృతి(Six-Year-Old Boy Drowns) చెందాడు. వివరాల్లోకి వెళితే.. మల్లాపూర్ గ్రామానికి చెందిన సూర లావణ్య, అంజి దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. లావణ్య రోజువారీ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఎప్పటిలాగే కూలి పనికి వెళ్లగా, పిల్లలు ఇంటి వద్ద ఆడుకుంటున్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి చిన్న కుమారుడు సూర బన్నీ (6) కనిపించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు.

అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు, గ్రామస్తులు కలిసి బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి సమీపంలోని వీధి చివర ఉన్న పశువుల నీటి కుండీలో బాలుడు మునిగిపోయి కనిపించాడు. వెంటనే బయటకు తీసి పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటి కుండీలో పడటంతోనే బాలుడు మృతి చెందినట్లు తెలుస్తోంది.మృతుడి తల్లి సూర లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్లాపూర్ ఎస్సై ఏ. అనిల్ తెలిపారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మరిన్ని వార్తలు