మహిళలు, బాలికల భద్రతకు నిర్భయ నిధి కింద ములుగు జిల్లా ఎంపిక...
- జిల్లాలో మహిళలు బాలికలకు మరింత భద్రత
- న్యూఢిల్లీ సమీక్షా సమావేశానికి హాజరైన జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు
ములుగు, అక్టోబర్ 14 (విజయక్రాంతి): మహిళలు, బాలికల భద్రత, రక్షణ, సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సురక్షితమైన సమగ్ర పట్టణాల అభివృద్ధి కోసం చేపట్టనున్న ప్రయోగాత్మక ప్రాజెక్టుకు(Experimental project) నిర్భయ నిధి(Nirbhaya Fund) కింద ములుగు జిల్లా ఎంపికైంది. ఈ ప్రాజెక్టు అమలు, కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్(Collector Borkhade Hemant ) సహదేవరావు హాజరయ్యారు.
సమావేశంలో ప్రాజెక్టు అమలుకు అవసరమైన ప్రణాళికలు, వివిధ శాఖల భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల కల్పన, మహిళలు, బాలికల భద్రతకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాలపై సమీక్షించారు. జిల్లాలో ప్రతిపాదిత కార్యక్రమాలు, సంబంధిత శాఖల సమన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా మహిళలు, బాలికలకు సురక్షితమైన ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయడంతో పాటు, వారి అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించనున్నారు.
సమాన అవకాశాలు, సౌకర్యవంతమైన వాతావరణం కల్పిస్తూ వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహం అందించనున్నారు. భద్రతపై అవగాహన కార్యక్రమాలు, మహిళల సాధికారత, ప్రభుత్వ శాఖల సమన్వయానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ములుగు జిల్లా ఈ ప్రాజెక్టుకు ఎంపిక కావడం మహిళలు, బాలికల భద్రత, గౌరవం, స్వావలంబనకు దోహదపడనుంది.
సంబంధిత శాఖల సమన్వయంతో ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేసి, మహిళలు, బాలికలకు సురక్షితమైన వాతావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయనుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ఇ.పి. ప్రేమలత పాల్గొన్నారు.