గోరంత స్థాయితో... కొండంత అక్రమాలు

14-10-2026 | 08:11pm
  1. దుండిగల్ సర్కిల్ లో రాజ్యమేళుతున్న చైన్ మెన్ తిరుపతి
  2. మిగతా చైన్ మెన్ లను సైతం బెదిరిస్తున్నట్లు ఆరోపణలు
  3. ఏసీబీ దాడులు జరిగిన మారని చైన్ మెన్ వైఖరి
  4. చైన్ మెన్ పేరు చెప్తే చాలు నిర్మాణదారులలో వణుకు
  5. దుండిగల్ డిసి కి చైన్ మెన్ పై ఎందుకంత ప్రేమ..?

కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): దుండిగల్ సర్కిల్(Dundigal Circle)లో చైన్ మెన్ తిరుపతి తీరుపై నిర్మాణదారులలో, స్థానికులలో తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సర్కిల్ లో అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయిన చైన్ మెన్ తిరుపతి కి ఇంతలా బాధ్యతలు అప్పగించడం ఏంటని స్థానికుల నుండి ప్రశ్నలు వెలువడుతున్నాయి.

దుండిగల్ సర్కిల్ లో చైన్ మెన్ రాజ్యమేళుతున్నాడు. అక్కడ చైన్ మెన్ తిరుపతి మాటే శాసనం.అక్రమ నిర్మాణాల వద్ద తనదైన శైలిలో లక్షల్లో వసూళ్లకు తెగబడుతూ పై అధికారులకు సైతం ఎవరి వాటాలు వారికి పంచుతున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.నిర్మాణదారులు ఎవరైనా సరే ముందు చైన్ మెన్ ను కలిసిన తర్వాతే టౌన్ ప్లానింగ్, పై అధికారులను కలవాలి.డిసి ఆదేశిస్తే జరగని పనులుంటాయేమో కానీ ఆ చైన్ మెన్ మాత్రం కనుసైగతోనే అక్రమాలను శాసించగలడు.స్థాయి డిసి కంటే చిన్నదే అయిన చేసే పనులు మాత్రం అంతకుమించి ఉంటాయి.

మిగతా చైన్ మెన్ లను బెదిరిస్తున్నట్లు ఆరోపణలు

అయితే దుండిగల్ సర్కిల్ పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా సరే ఎలాంటి అక్రమాలు జరిగిన ముందు తనకే చెప్పాలంటూ మిగతా చైన్ మెన్ లను సైతం బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగిన తన వద్దకే రావాలని దుండిగల్ సర్కిల్ లోనే తిష్టా వేశాడు. నిర్మాణదారులు ముందుగా తనను కలిసిన తరువాతే పై అధికారులను కలవాలి. కోర్ట్ కేసులు, బిల్డింగ్ ల అనుమతులు ఇలా సర్కిల్ కు సంబంధించిన వాటిని అవుట్ సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం ఏంటని స్థానికులు విమర్శిస్తున్నారు.మిగతా చైన్ మెన్లు పేరుకే... సర్కిల్ ను ఏలేది మాత్రం చైన్ మెన్ తిరుపతి అంటూ ఆరోపణలు ఉన్నాయి.

ఏసీబీ దాడులు జరిగిన మారని చైన్ మెన్ వైఖరి

అయితే గతంలో దుండిగల్ సర్కిల్ లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ అధికారులు గతం విధులు నిర్వహించిన చైన్ మెన్ లను విడివిడిగా విచారించారు. దాడులు జరిగిన అనంతరం అవుట్ సోర్సింగ్ సిబ్బందిని చైన్ మెన్ విద్ధుల్లోంచి తొలగించారు. కానీ చైన్ మెన్ ను తిరుపతికి మాత్రం కొన్ని రోజులు ఆఫీస్ లో కోర్ట్ కేసులు అప్పగించి నేడు మళ్ళీ చైన్ మెన్ బాధ్యతలు అప్పగించారు. దీంతో చైన్ మెన్ కు తిరిగి బలం వచ్చినట్లు అయ్యింది.అక్రమ నిర్మాణాల నుండి లక్షల్లో వసూళ్లకు తెగబడుతున్నాడు. సర్కిల్ పరిధిలోని చైన్ మెన్ పేరు చెప్తే చాలు నిర్మాణదారులలో వణుకు పుడుతుంది.

చైన్ మెన్ పై డిసి కి ఎందుకంత ప్రేమ..?

గతంలో ఏసీబీ దాడులు జరిగిన అనంతరం గత చైన్ మెన్ లను విధుల్లోంచి తొలగించారు. కానీ నేడు మాత్రం మిగతా చైన్ మెన్ లను వదిలేసి తిరుపతికి మాత్రమే చైన్ మెన్ విధులు అప్పజెప్పడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నిర్మాణదారుల నుండి మామూళ్లు మోసుకురావడానికి మిగతా చైన్ మెన్ లు అయితే భవిష్యతుల్లో పై అధికారుల నుండి సమస్యలు తలెత్తవచ్చు.

అదే తిరుపతి అయితే పై అధికారులను సైతం తన మంత్రంతో మాయ చేస్తాడు. కాబట్టి తప్పించుకోవచ్చని అందుకే చైన్ మెన్ కు విధులు అప్పాజెప్పారంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక అవుట్ సోర్సింగ్ సిబ్బంది అయిన చైన్ మెన్ పై సర్కిల్ డిసికి ఎందుకంత ప్రేమ..? ఇప్పటికైనా సర్కిల్ డిసి చైన్ మెన్ పై ఏమైనా చర్యలు తీసుకుంటారా లేకా... అక్రమ నిర్మాణదారుల వద్దకు రాయబారాలకు పంపుతారా అనేది వేచి చూడాలి.

మరిన్ని వార్తలు