వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి

14-10-2026 | 08:25pm

నిర్మల్ (విజయక్రాంతి): వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అవసరమైన అన్ని ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.

కొనుగోలు ప్రక్రియలో జాప్యం జరగకుండా, రైతులకు సకాలంలో సేవలు అందిస్తూ ధాన్యం సేకరణను సజావుగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం వరి ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై రూపొందించిన గోడప్రతులను కలెక్టర్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, పౌరసరఫరాల శాఖ అధికారులు రాజేందర్, సుధాకర్, డీఆర్‌డీఓ విజయలక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు