శాకంబరీ దేవి స్వరూపిణిగా అమ్మవారు
కొండపాక, అక్టోబరు 14 (విజయక్రాంతి): కొండపాక మండలం(Kondapaka mandal) మర్పడగ విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజు శాకంబరీ దేవి స్వరూపిణిగా విజయదుర్గ భక్తులకు దర్శనం ఇచ్చింది.
క్షేత్ర నిర్వాహకులు డాక్టర్ చెప్పెల హరినాధ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి విశేష పంచామృత ఫలరస అభిషేకం, చతుష్షష్టి ఉపచార పూజ, నవావరణ హవనం కుంకుమపూజలు తదితర కార్యక్రమాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హరినాథ్ శర్మ మాట్లాడుతూ శాకంబరీ దేవి విశిష్టతను తెలిపారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిపారు.