విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పంటలు

14-10-2026 | 08:31pm
  1. ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలి
  2. బీఆర్‌ఎస్‌ నాయకులు కళ్యాణ్ కార్ నర్సింగరావు

గజ్వేల్, అక్టోబర్14: విద్యుత్ సరఫరా(Power supply) సక్రమంగా లేక వరి పంటలు ఎండిపోతున్నాయని, రైతులకు తక్షణమే 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలని బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు కళ్యాణ్ కర్ నర్సింగరావు(BRS senior leader Kalyan Kar Narsing Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణ పరిధిలో రైతులతో కలిసి ఎండిపోతున్న వరి పొలాలను ఆయన సందర్శించి పంటల పరిస్థితిని పరిశీలించారు.

విద్యుత్ సరఫరాలో అంతరాయాల కారణంగా పంటలకు సరిపడా నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లు, జనరేటర్ల సహాయంతో నీటిని అందిస్తూ అదనపు ఖర్చులు భరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే సాగు పెట్టుబడులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు విద్యుత్ సమస్య మరింత భారంగా మారిందన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నాయకులు ఎర్రవాడ బాలకృష్ణ, డీజే షాదుల్‌తో పాటు రైతులు ఎర్రవాడ వెంకటేష్, యాదగిరి, స్వామి, నర్సింలు గౌడ్, బిక్షపతి, సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు