డంపింగ్ యార్డ్ సమస్యపై మంత్రి శ్రీధర్ బాబుకు వినతి
జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తొలగించాలి..
శాశ్వత పరిష్కారం చూపాలి
జవహర్‌నగర్,(విజయక్రాంతి): జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్(Jawaharnagar Dumping Yard) సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)కు వినతిపత్రం సమర్పించారు. డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యలు, ప్రజారోగ్య ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
డంపింగ్ యార్డ్ సమస్యపై ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, జేఏసీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కోరారు. కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
డంపింగ్ యార్డ్ సమస్యను రాజకీయ అంశంగా కాకుండా ప్రజల జీవన్మరణ సమస్యగా పరిగణించి శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మల్లారెడ్డి తో పాటు జేఏసీ కన్వీనర్ డాక్టర్ బి. శంకర్ నారాయణన్, కో-కన్వీనర్లు కె. పద్మ చారి, ఎం. సమ్మి రెడ్డి, ఏనుగు సంజీవరెడ్డి, జి. స్వర్ణ శ్రీనివాస్, దమ్మాయిగూడ మాజీ చైర్పర్సన్ ప్రణీత శ్రీకాంత్ గౌడ్, జవహర్‌నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, కొండల్ ముదిరాజ్తో పాటు వివిధ కాలనీల బాధితులు పాల్గొన్నారు.