కోలాహలంగా చేయూత పెన్షన్ల పంపిణీ
నియోజకవర్గంలో 3,928 పెన్షన్లు మంజూరు
సాంకేతిక కారణాలతో ఆగిన పెన్షన్లు మంజూరు చేయిస్తాం
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం క్లబ్బులో కోలాహలంగా చేయూత పెన్షన్ల పంపిణీ
కొత్తగూడెం టౌన్,(విజయక్రాంతి): అర్హులైన నిరుపేదలకు సామాజిక భద్రత పెన్షన్లు ఎంతో ఆర్థిక భరోసానిస్తాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(MLA Koonamneni Sambasiva Rao) అన్నారు. బుధవారం కొత్తగూడెం(Kothagudem) జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గ పరిధిలోని వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ కార్యక్రమం(Cheyuta Pension Proceedings Documents Distribution Program) జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని ముఖ్య అతిథిగా హాజరై చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 3,928 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరయ్యాయని, నియోజకవర్గంలో 30 వేల మంది అర్హులుగా గుర్తించామని వారికి విడతలవారీగా పెన్షన్లు మంజూరు జరుగుతుందని వెల్లడించారు. ఇందులో భాగంగా నేడు చుంచుపల్లి మండలానికి 562, లక్ష్మీదేవిపల్లి మండలానికి 566 పెన్షన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
అలాగే సుజాతనగర్ మండలానికి 228, పాల్వంచ మండలానికి 468, పాల్వంచ పట్టణానికి 919, కొత్తగూడెం పట్టణానికి 1,185 చొప్పున పెన్షన్లు మంజూరయ్యాయని తెలిపారు. దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు, వితంతువులు, ఒంటరి మహిళల కనీస అవసరాలకు ఈ పెన్షన్ సొమ్ము ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసుకుని వివిధ సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన అర్హులైన లబ్ధిదారుల పెన్షన్లను కూడా త్వరలోనే మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో అర్హులైన ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా అధికారులతో సమన్వయం చేసుకుంటూ న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. డీఆర్డీవో పిడి విద్యాచందన,ఆర్డీవో మధు, సివోవో నాగలక్ష్మి, ఎంపిడివోలు సుభాషిణి, సుస్మిత, ఎంపీఓలు సందీప్, డిపివోలు సాంబయ్య, అనూష, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, లైబ్రరీ, వ్యవసాయ కమిటీ చైర్మన్లు వీరబాబు, లాల్సింగ్, సర్పంచులు, వివిధపార్టీల నాయకులు పాల్గొన్నారు.