జర్నలిస్టుల ఐక్యతే లక్ష్యం
- మణుగూరు యునైటెడ్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక
- జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల పరిరక్షణకు పెద్దపీట
మణుగూరు,(విజయక్రాంతి): మణుగూరు(Manuguru ) ప్రాంత పాత్రికేయుల ఐక్యత, సంక్షేమం, హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యంగా యునైటెడ్ ప్రెస్ క్లబ్ ఆఫ్ మణుగూరు(United Press Club of Manuguru) నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని స్నేహ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (Telangana Working Journalists Federation) జాతీయ కౌన్సిల్ సభ్యులు చిర్ర శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, విధి నిర్వహణలో ఇబ్బందులు, వృత్తిపరమైన సవాళ్లు, సంక్షేమ పథకాల అమలుపై విస్తృతంగా చర్చించారు.ఉపాధ్యక్షులుగా నక్క వాసు, మారాసు సుధీర్, చింతల లెనిన్, సహాయ కార్యదర్శులుగా బాబీ, సనప భరత్ ఎన్నికయ్యారు. క్రీడా విభాగం బాధ్యుడిగా ఎడవల్లి శంకర్, సాంస్కృతిక విభాగం బాధ్యుడిగా ఉల్లి రామారావును ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా అక్కినపల్లి సత్యనారాయణ, కర్నె బాబురావుతో పాటు మరో పది మందికి అవకాశం కల్పించారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పోనగంటి కృష్ణ, కోశాధికారి స్టాలిన్ మాట్లాడుతూ.... జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే తమ ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. పాత్రికేయుల హక్కుల పరిరక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం, జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం కోసం నూతన కమిటీ నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మణుగూరు ప్రాంతానికి చెందిన వివిధ పత్రికల విలేకరులు పాల్గొన్నారు.