అప్పు తిరిగి చెల్లించే విషయంలో వివాదం..

14-10-2026 | 08:09pm

మణుగూరు, ( విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం పోలీస్ స్టేషన్(Karakagudem Police Station) పరిధిలో అప్పు లావాదేవీలకు సంబంధించిన వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిని హత్య (Murder )చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

కలువల నాగారం గ్రామానికి చెందిన బాధావత్ విజయ తన కుమారుడు బాధావత్ రవిచంద్రను కరకగూడెం గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్ హత్య చేసినట్లు ఈ నెల 12న కరకగూడెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో మృతుడు రవిచంద్ర నిందితుడు ఇమ్రాన్‌కు రూ.80,000 అప్పుగా ఇచ్చినట్లు, ఆ నగదు తిరిగి చెల్లించే విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నట్లు వెల్లడైంది.

ఈ నేపథ్యంలో నిందితుడు పథకం ప్రకారం ఈ నెల 11వ తేదీ రాత్రి సుమారు 9.30 గంటల సమయంలో రవిచంద్రను మోటార్ సైకిల్‌పై తీసుకెళ్లి కలువల నాగారం గ్రామ శివారులో అతనిపై దాడి చేసి, బెల్టుతో గొంతు బిగించి హత్య చేసినట్లు దర్యాప్తులో గుర్తించారు.

ఈ కేసులో భాగంగా బుధవారం నిందితుడు మహమ్మద్ ఇమ్రాన్‌ను అతని ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన మోటార్ సైకిల్‌తో పాటు రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం న్యాయస్థానానికి తరలించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు