బీసీల లెక్క తేల్చాలి.. హక్కుల వాటా ఇవ్వాలి!
ఇల్లెందు టౌన్, నవంబర్ 21 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన (Census)లో ఓబీసీల కులగణనను తప్పనిసరిగా చేపట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ సాధన కోసం డిసెంబర్ 14న ఢిల్లీలో బీసీల జనగణన సభ నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర ఓబీసీ మహాసంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ వెల్లడించారు.
శనివారం ఇల్లెందులోని ఏక్తా హౌస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చలో ఢిల్లీ పోస్టర్ను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. దేశ జనాభాలో సుమారు 60 శాతం ఉన్న బీసీలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన ప్రాతినిధ్యం, రిజర్వేషన్లు (Reservations) లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్ల తర్వాత రూ.11,735 కోట్ల ప్రజాధనంతో చేపడుతున్న జనగణనలో ఓబీసీలను కూడా లెక్కించి, వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.
బీసీల సంక్షేమం గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి జనగణనలో ఓబీసీలను ప్రత్యేకంగా గుర్తించకపోవడం అన్యాయమని విమర్శించారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించడం వల్ల బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దక్కాల్సిన అవకాశాలు దెబ్బతింటున్నాయని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 79 ఏళ్లు గడిచినా బీసీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు అందడం లేదని, పాలకులను శాసించే స్థాయి నుంచి హక్కుల కోసం అడుక్కునే పరిస్థితికి బీసీలు చేరుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్డీఏ కూటమి బీసీల వ్యతిరేక కూటమిగా మారిందని, ఇండియా కూటమి బీసీల పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ప్రకటనలు, లేఖలకే పరిమితమవుతూ సమస్య పరిష్కారానికి చొరవ చూపడం లేదని విమర్శించారు. బీసీలకు న్యాయం చేయడంలో పాలకులు విఫలమైతే రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
డిసెంబర్ 14న ఢిల్లీలో నిర్వహించనున్న బీసీల జనగణన సభకు దేశవ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకుడు మడత వెంకట్ గౌడ్, దండు సారయ్య, రామ్ చందర్, బండం నాగయ్య తదితరులు పాల్గొన్నారు.