గంజాయి సేవిస్తూ పట్టుబడ్డ 9 మంది..!
డ్రగ్ టెస్టుల్లో తొమ్మిది మందికీ టీహెచ్‌సీ పాజిటివ్.. డీ-అడిక్షన్ చికిత్సకు సిద్ధం
అచ్చంపేట: పట్టణంలోని వై-జంక్షన్ సమీపంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్(Indian Oil Petrol Bunk) వెనుక గంజాయి సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న తొమ్మిది మందిని అచ్చంపేట పోలీసులు అరెస్టు చేశారు. శనివారం ఉదయం 8.45 గంటల సమయంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. డ్రగ్ టెస్టింగ్ కిట్(Drug testing kit)తో నిర్వహించిన మూత్ర పరీక్షల్లో తొమ్మిది మందికీ టీఎచ్‌సీ (టెట్రాహైడ్రోకాన్నబినాల్) పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో వీరు అచ్చంపేటలో గంజాయి విక్రయిస్తున్న ఎం.డి. రసూల్ బాబా, పుట్టపాగ రాజేష్ వద్ద ఒక్కో ప్యాకెట్ రూ.500కు కొనుగోలు చేసి సేవిస్తున్నట్లు వెల్లడించారు. కొందరికి హైదరాబాద్, కర్నూలు తదితర ప్రాంతాల్లో పనిచేసే సమయంలో స్నేహితుల ద్వారా ఈ అలవాటు ఏర్పడగా.. మరికొందరు స్థానికంగా విక్రయదారుల వద్ద కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు.
గంజాయి అలవాటును విడిచిపెట్టేందుకు ముందుకు..
గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన వారిలో జేవాజి నాగరాజు గౌడ్ (రంగాపూర్), తంగెళ్ల శేఖర్, డేరంగుల అజయ్ (కోనాపురం), పిన్నేప్రాల పవన్ (భువనగిరి), ఎం.డి. హబీబ్ (మారుతీనగర్), దాసర్ల మహేష్ (టంగాపూర్ కాలనీ), పొలం బాలరాజ్ (తాడూరు), కుంద చరణ్ (మాధవనిపల్లి), రాసమల్ల ఆంజనేయులు (గువ్వలోనిపల్లి) ఉన్నారు. వీరంతా గంజాయి అలవాటును విడిచిపెట్టి చికిత్స, పునరావాసం పొందేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన డీ-అడిక్షన్ కేంద్రంలో చికిత్స అందించేందుకు సంబంధిత న్యాయస్థానం ముందు అభ్యర్థనలు సమర్పించేలా పోలీసులు చర్యలు చేపడుతున్నారు.
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
యువత గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని డి.ఎస్.పి శ్రీనివాసులు ఎస్ఐ నరేష్ సూచించారు. గంజాయి సేవించడం ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. విక్రయదారుల ప్రలోభాలకు లోనుకావద్దని, అలవాటు ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి డీ-అడిక్షన్ చికిత్స పొందాలని విజ్ఞప్తి చేశారు.