అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్

21-11-2026 | 08:23pm

న్యూఢిల్లీ: శబరిమల అయ్యప్ప భక్తుల(Sabarimala Ayyappa Devotees)కు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పవిత్రమైన ఇరుముడి కట్టు(Irumudi Kettu)ను విమానాల్లో క్యాబిన్ బ్యాగేజీగా తీసుకెళ్లేందుకు అనుమతిని వరుసగా మూడో ఏడాది కూడా కొనసాగించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు(Union Minister for Civil Aviation Kinjarapu Rammohan Naidu) వెల్లడించారు. శబరిమల యాత్ర(Sabarimala yatra)లో ఇరుముడి కట్టుకు ఎంతో పవిత్రత, ప్రత్యేకత ఉందని మంత్రి పేర్కొన్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని, అయ్యప్ప భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

భక్తులు విమాన ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS), కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF), విమానాశ్రయ నిర్వాహకులకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు. విమానాశ్రయాల్లో భద్రతా తనిఖీల సమయంలోనూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని సూచించినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా విమానాల్లో శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప భక్తులకు ఎంతో ఊరట లభించనుంది. పవిత్ర యాత్రను చేపడుతున్న ప్రతి ఒక్కరిపై అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు