రామాంజనేయ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

19-11-2026 | 04:51pm

డి.ఎస్.పి ఆదినారాయణ

చుంచుపల్లి, నవంబర్ 19(విజయక్రాంతి ): జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(District SP Rohit Raju) ఐపిఎస్ ఆదేశాల మేరకు గురువారం తెల్లవారుజామున చుంచుపల్లి పోలీస్ స్టేషన్(Chunchupalli Police Station) పరిధిలోని రామాంజనేయ కాలనీలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో సుమారు 100 ఇళ్లను తనిఖీ చేయగా, 54 ద్విచక్ర వాహనాలు, 08 ఆటోలను తనిఖీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘించిన 45 వాహనాలపై జరిమానాలు విధించగా, 15 వాహనాలకు సంబంధించి జరిమానాలు వసూలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 11 వాహనాలను పోలీస్ స్టేషన్‌లో అదుపులో ఉంచారు.

అదేవిధంగా అక్రమ మద్యం కు సంబంధించి 04 కేసులు నమోదు చేశారు.  ఈ సందర్భంగా కొత్తగూడెం డిఎస్పి ఆదినారాయణ కాలనీ వాసులతో సమావేశమై మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువతపై వాటి ప్రభావం గురించి వివరించారు.

గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 

అలాగే మంత్రాలు, చేతబడి వంటి మూఢనమ్మకాలను నమ్మి మోసపోవద్దని, వాటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని అవగాహన కల్పించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.

సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, బ్యాంకు వివరాలను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కాలనీలోని ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు దోహదపడుతుందని వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మి, వెంకటేశ్వర్లు, యాసీన్, ఇంద్రసేనారెడ్డి, జితేందర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు