సేంద్రియ వ్యవసాయంతో అధిక దిగుబడులు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందాలి: కలెక్టర్ రాజర్షి షా
బేల నవంబర్ 19 (విజయక్రాంతి): ప్రతి రైతు సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అవలంబించి అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా(District Collector Rajarshi Shah) సూచించారు. గురువారం బేల మండలంలోని చాంద్పల్లి గ్రామంలో సీపీఎస్ సంస్థ(CPS Organization) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా తొలుత కోరంగే దగ్గాజీ అనే రైతు సాగు చేస్తున్న పంటలను పరిశీలించి, వ్యవసాయ విధానాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల నేల సారవంతం పెరగడంతో పాటు ప్రజల ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రైతులు వర్షపు నీటిని వృథా చేయకుండా ప్రతి పొలంలో వి.బి.జి. రాంజీ పథకం ద్వారా నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా ప్రతి ఇంటి ఆవరణలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వీటి ద్వారా భూగర్భ జలమట్టం పెరుగుతుందని తెలిపారు.
ఈ ఏడాది తక్కువ వర్షపాతం కారణంగా పంటలకు నష్టం వాటిల్లిందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంట నష్టాన్ని గుర్తించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసే ప్రక్రియ చేపట్టిందన్నారు. బేల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించినట్లు గుర్తుచేశారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి నష్టపోయిన రైతుల వివరాలను నమోదు చేస్తారని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మనోహర్, సీపీఎస్ సంస్థ డైరెక్టర్ గిరిజా, చాంద్పల్లి సర్పంచ్ కోరంగే మంజుల సోనేరావు, తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీఓ మహేష్ కుమార్, మండల వ్యవసాయ అధికారి సాయి తేజ రెడ్డి, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సందీప్ కుమార్, సీపీఎస్ సంస్థ ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.