ఇంటర్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయ్!

19-11-2026 | 04:18pm

తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు (Intermediate Board) కీలక అప్‌డేట్ ఇచ్చింది. 2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్ పబ్లిక్ పరీక్షల (Public Examinations) షెడ్యూల్‌ను విడుదల చేసింది. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల్లో ఇప్పటి నుంచే ఎగ్జామ్ టెన్షన్ మొదలైంది.

ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ (Exam Schedule) ప్రకారం ఫిబ్రవరి 24న ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తొలి పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 25న ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మొదటి పరీక్ష నిర్వహించనున్నారు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.మరోవైపు సైన్స్ గ్రూపు విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు (Practical Examinations) నిర్వహించనున్నారు. ప్రాక్టికల్స్‌తో పాటు థియరీ పరీక్షలకు కూడా విద్యార్థులు ముందుగానే సిద్ధం కావాలని అధికారులు సూచిస్తున్నారు.

పరీక్షల తేదీలు ప్రకటించడంతో విద్యార్థులు తమ చదువుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. సిలబస్‌ను పూర్తిచేసుకోవడంతో పాటు గత ప్రశ్నపత్రాలను సాధన చేయడం, ముఖ్యమైన అంశాలను పునశ్చరణ చేసుకోవడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.ఇంటర్ బోర్డు పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల్లో పరీక్షల సందడి మొదలైంది. తల్లిదండ్రులు కూడా పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సిన సమయం ఆసన్నమైంది.

మరిన్ని వార్తలు