పుట్ట మధు వ్యాఖ్యలు అవగాహన లేని అవివేకం
- మంథని అభివృద్ధిని చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు
- 2029 ఎన్నికల్లో శ్రీధర్ బాబుకు 50 వేల మెజారిటీ ఖాయం: మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్
మంథని, నవంబర్ 19(విజయ క్రాంతి): మంథని నియోజకవర్గంలో(Manthani Constituency) మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) చేపడుతున్న అభివృద్ధిని చూసి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మంథని మున్సిపల్ చైర్మన్ ఒడ్నాల శ్రీనివాస్ విమర్శించారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంథని ఐదో వార్డు పరిధిలోని కూచిరాజుపల్లెలో శిథిలావస్థకు చేరిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం విద్యార్థులకు ప్రమాదకరంగా మారడంతో స్థానికుల విజ్ఞప్తి మేరకు మంత్రి శ్రీధర్ బాబు రూ.40 లక్షలతో నూతన పాఠశాల భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారని తెలిపారు. అలాగే ఆర్ అండ్ బీ అతిథి గృహ నిర్మాణానికి కూడా నిధులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. వాస్తవాలు తెలుసుకోకుండా పుట్ట మధు ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదన్నారు.
ఎలాంటి పక్షపాతం లేకుండా మంథని పట్టణానికి 220 ఇందిరమ్మ ఇళ్లను మంత్రి మంజూరు చేయించారని, 2029 శాసనసభ ఎన్నికల్లో శ్రీధర్ బాబుకు 50 వేల మెజారిటీ రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జేఎన్టీయూ పాఠశాల వల్ల డ్రగ్స్ వ్యాప్తి చెందుతున్నాయంటూ పుట్ట మధు మాట్లాడటం ఆయన అవగాహనారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
అనంతరం వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి మాట్లాడుతూ, తన వార్డు పరిధిలోని పాఠశాల భవనంపై పుట్ట మధు చేసిన వ్యాఖ్యల పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని స్థానికులు జానీ నేతృత్వంలో మంత్రి శ్రీధర్ బాబును కోరగా, ఆయన రూ.40 లక్షలు మంజూరు చేయించారని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్న పుట్ట మధు, ఎస్సీ వర్గాలకు క్షమాపణ చెప్పిన తర్వాతే కూచిరాజుపల్లెలో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో కౌన్సిలర్లు పెంటరి రాజు, నూకల కమల్, కాంగ్రెస్ రాష్ట్ర మీడియా సెల్ ప్రధాన కార్యదర్శి ఆరెల్లి కిరణ్ కుమార్ గౌడ్, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షుడు మంథని సత్యం, పట్టణ అధ్యక్షుడు నాగేల్లి జానీ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తోకల మల్లేష్, సీనియర్ నాయకులు ఎరుకల రమేష్ తదితరులు పాల్గొన్నారు.