ఇందిరమ్మ బీమాపై అవగాహన
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన గ్రామ సభ
హన్వాడ (విజయక్రాంతి): గ్రామీణ పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై(Indiramma Family Life Insurance Scheme) యారోనిపల్లి గ్రామంలో అవగాహన గ్రామ సభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎస్.స్వాతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ ప్రజలకు, వివిధ రాజకీయ పార్టీల నాయకులకు పథకం వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ స్వాతి మాట్లాడుతూ.. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. రేషన్ కార్డు కలిగి ఉండి, 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ గ్రామంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.
కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా అండగా నిలవాలనే గొప్ప ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. పేద కుటుంబాలకు భరోసా కల్పించే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శివకుమార్, ఉప సర్పంచ్ మైబమ్మ, కాంగ్రెస్ నాయకులు పోచమోని వెంకటయ్య, శ్రీనివాస్ రెడ్డి, బుక్ కీపర్ సుజాత, ప్రేమలత, మహిళా సంఘాల సభ్యులు, పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.