18 వేల మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన

22-11-2026 | 01:35pm

బాన్సువాడ, నవంబర్ 22 (విజయక్రాంతి): భారతదేశంలోనే తొలిసారిగా 18 వేల మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన, 10 వేల మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించేందుకు భారీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ‘శ్రీ అయ్యప్ప స్వామి కోటి నామార్చన అంగ నాట్యంతో అద్వైత సంగమం’ పేరుతో ఈ మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్ 12వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి పటాన్‌చెరు సమీపంలోని ఓఆర్‌ఆర్ పక్కన ఉన్న జీఎంఆర్ కన్వెన్షన్ గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. పందళ రాజవంశీయులు, శంకరాచార్యుల వంశీయుల సమక్షంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 18 వేల మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన (Koti Namarchana), సాయంత్రం 4 గంటల నుంచి 10 వేల మంది మహిళలతో కోటి కుంకుమార్చన (Kumkumarchana) నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ రికార్డు (World Record) సాధించడమే లక్ష్యంగా నిర్వాహకులు ముందుకు సాగుతున్నారు.

ఈ మహోత్సవంపై రాష్ట్రవ్యాప్తంగా భక్తుల్లో అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచార రథం ఆదివారం బాన్సువాడ పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా బాన్సువాడ అయ్యప్ప స్వామి ఆలయ అధ్యక్షుడు అర్షపల్లి సాయిరెడ్డి గురుస్వామి, విట్టల్ రెడ్డి గురుస్వామి, మల్లికార్జున్ గురుస్వామి, తాటి ప్రశాంత్ గురుస్వామితో పాటు పలువురు అయ్యప్ప స్వాములు ప్రచార రథానికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం నృత్యాలు, భజనలతో ప్రచార రథాన్ని అయ్యప్ప ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ ఆధ్యాత్మిక మహోత్సవంలో భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

మరిన్ని వార్తలు