ట్రాన్స్‌ఫార్మర్ల ధ్వంసం
ఇరవెండిలో రైతుల మోటార్లు, విద్యుత్ పరికరాలే లక్ష్యంగా చోరీలు
15 రోజుల క్రితమే మోటారు అపహరణ.. తాజాగా ట్రాన్స్‌ఫార్మర్ పగలగొట్టి రాగి తీగల చోరీ
బూర్గంపాడు,(విజయక్రాంతి): రైతుల పంటలకు సాగునీరు అందించే విద్యుత్ పరికరాలే దొంగలకు లక్ష్యంగా మారుతున్నాయి. కాపర్ వైర్ కోసం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను(Transformers) ధ్వంసం చేస్తూ రైతులకు తీరని నష్టం కలిగిస్తున్నారు. బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలో ఇటీవల ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను అపహరించిన ఘటన కలకలం రేపుతోంది. గత 15 రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఓ రైతుకు చెందిన మోటారును దొంగలు అపహరించారు. అంతకుముందు కూడా గ్రామంలోని పలు ప్రాంతాల్లో చోరీలు జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. తాజాగా ట్రాన్స్‌ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను తీసుకెళ్లడంతో రైతులు(Farmers) ఆందోళన చెందుతున్నారు.
చోరీ చేసిన రాగి తీగలను పాత ఇనుము దుకాణాల్లో విక్రయిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పంటలకు నీరందించే సమయంలో మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతుండటంతో రైతులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా సాగు పనులకు ఆటంకం ఏర్పడుతోంది. రాత్రివేళల్లో గుర్తుతెలియని వ్యక్తులు సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.బూర్గంపాడు, అశ్వాపురం మండలాల్లో రాత్రివేళ పోలీసు గస్తీని ముమ్మరం చేయాలని, వరుస చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ప్రజలు కోరుతున్నారు. కాపర్ వైర్ కొనుగోలు చేసే పాత ఇనుము దుకాణాలపైనా నిఘా పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.