అంబేద్కర్‌కు ఘోర అవమానం!
- -విగ్రహం కనిపించకుండా అడ్డంగా ఫ్లెక్సీ
- -డీఎస్పీ ప్రారంభించిన సీసీ కెమెరాకు సైతం అడ్డంకి
- -అంబేద్కర్ ఆశయాలు వల్లించడం తప్ప.. ఆచరణలో శూన్యమా?
- -నాయకుల తీరుపై స్థానికుల అసహనం..
- -అధికారుల స్పందన కోసం ఎదురుచూపులు
వెంకటాపూర్, నవంబర్ 22 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు గౌరవం ఇవ్వాల్సిన చోటే ఆయన విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ ఘటన వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట గ్రామంలో చోటుచేసుకుంది. అంబేద్కర్ ఆశయాలు, రాజ్యాంగ విలువల గురించి గొప్పగా మాట్లాడే నాయకులు.. ఆయన విగ్రహం వద్ద కనీస గౌరవం పాటించకపోవడం పట్ల స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహం ముందు అడ్డంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో అంబేద్కర్ విగ్రహం పూర్తిగా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు..
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశం ఆయనను స్మరించుకోవడం, ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయడం. అలాంటి విగ్రహం అందరికీ కనిపించేలా ఉండాల్సింది పోయి, అడ్డంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేసి విగ్రహాన్నే కనిపించకుండా చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రచార ఆర్భాటానికి ఇచ్చే ప్రాధాన్యతలో కొంతైనా మహనీయుల విగ్రహాల గౌరవానికి ఇవ్వకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
డీఎస్పీ ప్రారంభించిన సీసీ కెమెరాకు సైతం అడ్డంకి..
మరోవైపు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని పోలీసు శాఖ ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రారంభించిన సీసీ కెమెరాకు కూడా ఈ ఫ్లెక్సీ అడ్డుగా మారింది. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, ప్రజలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కెమెరా ముందు ఫ్లెక్సీ ఉండటంతో కెమెరా పర్యవేక్షణకు ఆటంకం కలిగే పరిస్థితి ఏర్పడింది. పోలీసు అధికారుల సమక్షంలో ప్రారంభించిన కెమెరా పరిస్థితి ఇలా మారడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రచారమే ముఖ్యమా..మహనీయుల గౌరవం అక్కర్లేదా?
నాయకులు తమ కార్యక్రమాల ప్రచారం కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడంలో తప్పులేదని, అయితే అందుకు ఒక పద్ధతి ఉండాలని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. మహనీయుల విగ్రహాలకు అడ్డంగా, ప్రజా భద్రతకు ఉపయోగపడే సీసీ కెమెరాల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకొని కార్యక్రమాలు నిర్వహించే నాయకులు ఆయన విగ్రహం గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తించాలని సూచిస్తున్నారు.
అధికారులు ఇప్పటికైనా స్పందిస్తారా?
ఈ వ్యవహారంపై సంబంధిత పోలీసు, స్థానిక అధికారులు వెంటనే స్పందించి అంబేద్కర్ విగ్రహం పూర్తిగా కనిపించేలా ఫ్లెక్సీని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే సీసీ కెమెరాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాతకు తగిన గౌరవం కల్పించడంతో పాటు ప్రజా భద్రతకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. అంబేద్కర్ ఆశయాలు వేదికలపై ప్రసంగాలకే పరిమితమా? లేక ఆయనకు గౌరవం ఇవ్వడంలోనూ నాయకులు బాధ్యత చూపుతారా? విగ్రహం కనిపించకుండా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన ఈ వ్యవహారంపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.