హిందువుల ఐక్యతే లక్ష్యం!

22-11-2026 | 05:15am

భారతీయ సంస్కృతి(Indian Culture).. సనాతన ధర్మం(Sanatana Dharma).. ఆధ్యాత్మిక వారసత్వం.. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మహోన్నత జీవన విధానాలు!. అనేక భాషలు, ప్రాంతాలు, ఆచారాలు, సంప్రదాయాలు కలిగిన హిందూ సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. సమైక్యత, సంఘటిత శక్తి, ధార్మిక చైతన్యం పెంపొందించాలనే మహత్తర సంకల్పంతో ఆవిర్భవించిన సంస్థ విశ్వహిందూ పరిషత్. 1964 ఆగస్టు 29న శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని సందీపని సాధనాలయంలో సాధుసంతులు, ఆధ్యాత్మికవేత్తలు, సామాజిక ప్రముఖుల సమక్షంలో విశ్వహిందూ పరిషత్ ఆవిర్భవించింది.

పరమపూజ్య స్వామి చిన్మయానంద, సంత్ తుకడోజీ మహారాజ్, మాస్టర్ తారాసింగ్ తదితర ప్రముఖుల ఆశీస్సులు, మార్గదర్శకత్వం సంస్థకు బలమైన పునాదులయ్యాయి. నాటి నుంచి నేటి వరకు ఆరు దశాబ్దాల కు పైగా ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజ సంఘటన, సనాతన ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి వ్యాప్తికోసం నిరంతరం కృషి చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 60 పైగా దేశాల్లో విశ్వహిందూ పరిషత్ హిందూ ధర్మ పరిరక్షణ, ప్రచారం కోసం పనిచేస్తోంది. యువతను చైతన్య పరుస్తూ వారిలో దేశభక్తి, దైవభక్తి నింపుతోంది.

సాధుసంతుల సమన్వయం 

హిందూ ధర్మంలోని వివిధ సంప్రదాయాలు, పీఠాలు, మఠాలు, ఆశ్రమాలు, అఖాడాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి.. ధార్మిక అంశాలపై ఉమ్మడి ఆలోచన, సమష్టి కార్యాచరణకు బాటలు వేయడం విశ్వహిందూ పరిషత్ సాధించిన గొప్ప విజయాల్లో ఒకటి. ధర్మసంసద్, కేంద్రీయ మార్గదర్శక మండలి వంటి వేదికల ద్వారా శంకరాచార్యులు, పీఠాధిపతులు, సాధువులు, సంతులు, ధర్మాచార్యుల మధ్య సమన్వయాన్ని పెంపొందించింది. సంప్రదాయాలు వేరైనా ధర్మం ఒక్కటే, సమాజ హితం అందరి బాధ్యత అనే భావనను బలంగా చాటుతోంది.

అయోద్య ఉద్యమం..చారిత్రక ఘట్టం 

విశ్వహిందూ పరిషత్ చరిత్రలో అయోధ్య శ్రీరామ జన్మభూమి ఉద్యమం అత్యంత కీలక ఘట్టం. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్రుని జన్మస్థలంలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరగాలనే సంకల్పంతో శిలా పూజలు, రామజ్యోతి కార్యక్రమాలు, ధర్మసభలు, కరసేవలు నిర్వహిస్తూ దేశవ్యాప్తంగా ధార్మిక చైతన్యం కలిగించింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. అనంతరం అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం పూర్తి చేసుకొని 2024 జనవరి 22న ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. కోట్లాది భక్తుల చిరకాల ఆకాంక్ష సాకారమైన ఈ ఘట్టం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో విశిష్ట మైలురాయి.

గోమాతకు విశిష్ట స్థానం 

భారతీయ సంస్కృతిలో గోమాతకు విశిష్ట స్థానం ఉంది. వ్యవసాయం, పాడిపరిశ్రమ, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో గోవుల పాత్ర ఎంతో గొప్పది. గోవుల అక్రమ రవాణా, అక్రమ వధను అరికట్టడం, గోశాలల నిర్వహణ, పశుసంపద సంరక్షణ, రైతుల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలకు విశ్వహిందూ పరిషత్ ప్రాధాన్యమిస్తోంది. గోరక్షణ అనేది కేవలం ధార్మిక అంశం మాత్రమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ సమతుల్యత, దేశీయ పశుసంపద పరిరక్షణకు సంబంధించిన సామాజిక బాధ్యత అనే సందేశాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

ఆలయాల పరిరక్షణ

దేవాలయాలు భారతీయ కళలు, శిల్పకళ, చరిత్ర, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతకు సజీవ ప్రతిరూపాలు. ప్రాచీన దేవాలయాల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, ఆలయ ఆస్తుల సంరక్షణ, పూజా సంప్రదాయాల పరిరక్షణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణలో విశ్వహిందూ పరిషత్ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగానే కాకుండా సామాజిక సేవ, విద్య, సంస్కతి వికాసానికి కేంద్రాలుగా ఉండాలనే భావనను ప్రోత్సహిస్తోంది.

ధార్మిక స్వేచ్ఛకు భరోసా

బలవంతం, ప్రలోభాలు, మోసపూరిత పద్ధతుల ద్వారా జరిగే మతమార్పిడులు వ్యక్తుల స్వేచ్ఛకు, సమాజంలో విశ్వాస సంబంధాలకు విఘాతం కలిగిస్తాయని విశ్వహిందూ పరిషత్ భావిస్తోంది. ముఖ్యంగా గిరిజన, వెనుకబడిన, ఆర్థికంగా బలహీన వర్గాల్లో అవగాహన కార్యక్రమాలు, ధార్మిక విద్య, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సామాజిక భరోసా కల్పిస్తోంది. బలవంతపు మతమార్పిడులపై చట్టబద్ధమైన పోరాటానికి ప్రాధాన్యతనిస్తోంది. వ్యక్తుల స్వచ్ఛంద విశ్వాస స్వేచ్ఛను గౌరవిస్తూనే, బలవంతపు చర్యలను చట్టపరంగా ఎదుర్కోవాలనే దక్పథాన్ని ముందుకు తీసుకెళ్తోంది.

మహిళా గౌరవం, భద్రతకు ప్రాధాన్యం 

హిందూ సంస్కృతిలో స్త్రీని శక్తిస్వరూపిణిగా ఆరాధిస్తారు. మహిళల గౌరవం, ఆత్మగౌరవం, భద్రత, సాధికారతకు విశ్వహిందూ పరిషత్ అనుబంధ మహిళా విభాగాలు ప్రాధాన్యతనిస్తున్నాయి. దుర్గావాహిని, మాతశక్తి వేదికల ద్వారా ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, ధార్మిక చైతన్యం పెంపొందించే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మహిళలపై వేధింపులు, అక్రమ రవాణా, మోసం, బలవంతపు చర్యలపై అవగాహన కల్పిస్తూ, వారి వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించడంతో పాటు చట్టపరమైన రక్షణపై చైతన్యం కల్పిస్తున్నాయి. 

కులమత భేదాలకు అతీతంగా సమరసత 

కుల, ప్రాంత, భాషా భేదాలు హిందూ సమాజ ఐక్యతకు అడ్డంకులు కాకూడదనే ఉద్దేశంతో విశ్వహిందూ పరిషత్ సామాజిక సమరసతకు ప్రాధాన్యతనిస్తోంది. 1969లో ఉడిపి ధర్మసమ్మేళనంలో ప్రతిధ్వనించిన ‘హిందవః సోదరాః సర్వే, న హిందూ పతితో భవేత్’ అనే సందేశం సమానత్వ భావనకు ప్రతీకగా నిలిచింది. అంటరానితనం, కులవివక్ష, సామాజిక అసమానతలను తొలగించి ప్రతి హిందువుకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలనే దిశగా సమరసతా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అణగారిన వర్గాల నుంచి అర్చకులను తీర్చిదిద్దడం, సామాజిక ఐక్యతను పెంపొందించడం వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తోంది. 

భారతీయ సంస్కృతికి అంతర్జాతీయ గుర్తింపు

విదేశాల్లో నివసిస్తున్న హిందువులను కూడా ఒకే వేదికపైకి తీసుకురావడంలో విశ్వహిందూ పరిషత్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ హిందూ సమ్మేళనాలు, ధార్మిక సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, హిందూ దేవాలయాల అభివృద్ధి, ప్రవాస భారతీయుల మధ్య సమన్వయం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో హిందూ సమాజ ఐక్యతను బలోపేతం చేస్తోంది. విదేశాల్లోని భారతీయ సంతతి యువతకు భారతీయ సంస్కృతి, భాషలు, పండుగలు, యోగా,ఆధ్యాత్మిక విలువలపై అవగాహన కల్పిస్తోంది.

యువతలో ధార్మిక చైతన్యం

యువత దేశ భవిష్యత్తుకు పునాదులు. వారిలో క్రమశిక్షణ, సేవాభావం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి, ధార్మిక చైతన్యం పెంపొందించేందుకు బజరంగ్ దళ్ వంటి యువజన వేదికలు పనిచేస్తున్నాయి. అదే విధంగా దుర్గావాహిని మహిళా శక్తిని సంఘటితం చేస్తోంది. సమాజ సమస్యలపై అవగాహన కల్పిస్తూ యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. విశ్వహిందూ పరిషత్ కార్యకలాపాలు ధార్మిక ఉద్యమాలకే పరిమితం కాలేదు.

విద్య, వైద్యం, ఆరోగ్య శిబిరాలు, రక్తదానం, విపత్తుల సమయంలో సహాయక చర్యలు, పేద విద్యార్థులకు సహాయం, గిరిజన ప్రాంతాల్లో సామాజిక సేవ వంటి అనేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సేవ, సంస్కారం, సంఘటన, రక్షణ అనే ప్రధాన సూత్రాలతో సమాజంలోని అన్ని వర్గాలకు చేరువ కావడానికి కృషి చేస్తోంది.

నేటి తరానికి సందేశం

1964లో ప్రారంభమైన వీహెచ్‌పీ ప్రస్థానం ఆరు దశాబ్దాలు దాటి 63వ సంవత్సరంలో కొనసాగుతోంది. ఈ ప్రయాణంలో ఎన్నో విజయాలు, అనుభవాలు, సవాళ్లు, సామాజిక మార్పులు చోటుచేసుకున్నాయి. అయినప్పటికీ సంస్థ ముందున్న బాధ్యతలు ఇంకా ఎన్నో ఉన్నాయి. కులవివక్షకు తావులేని సమాజ నిర్మాణం, పేదలకు విద్య, పేదరిక నిర్మూలనకు తోడ్పాటు, దేవాలయాల పరిరక్షణ, గోసంరక్షణ, మహిళల గౌరవం, యువతలో సంస్కారాలు, సాధుసంతుల సమన్వయం, హిందూ సమాజంలో పరస్పర విశ్వాసం మరింత బలోపేతం కావాలి.

హిందూ ఐక్యత అంటే  సొంత సంస్కృతిపై గౌరవం, ఇతరుల విశ్వాసాల పట్ల పరస్పర మర్యాద, సమాజం పట్ల బాధ్యత, దేశం పట్ల నిబద్ధత కలిగి ఉండటమే నిజమైన ఐక్యత. ధర్మం అంటే మానవత్వం. సేవ అంటే సమాజ హితం. సంఘటన అంటే సమష్టి శక్తి. సంస్కారం అంటే వ్యక్తిత్వ వికాసం.

‘ధర్మో రక్షతి రక్షితః’ అనే సనాతన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ, భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటుతూ, సేవా కార్యక్రమాలతో సమాజానికి అండగా నిలవడమే విశ్వహిందూ పరిషత్ భవిష్యత్ ప్రస్థానానికి మార్గదర్శకం కావాలి.

హిందూ సమాజం సంఘటితమైతేనే సంస్కృతి సురక్షితం. సంస్కృతి సజీవంగా ఉంటేనే దేశ ఆత్మగౌరవం పదిలం. ఈ మహత్తర సంకల్పంతో విశ్వహిందూ పరిషత్ ధర్మప్రస్థానం మరింత శక్తివంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షిద్దాం. హిందువులందరం విశ్వహిందూ పరిషత్‌లో చేరుదాం.. హిందూ ధర్మ ఐక్యతను చాటుదాం.

మరిన్ని వార్తలు